భారత్‌కు దూరమయ్యం
` చైనా చీకటి వలయంలో భారత్ చిక్కుకుంది
` ట్రంప్ కీలక వ్యాఖ్యలు
` షాంఘై సహకార సంస్థ సదస్సులో మోదీ, పుతిన్, జిన్‌పింగ్‌లు కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసిన అమెరికా అధ్యక్షుడు
భారత్- అమెరికా సంబంధాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు దిగజారాయనే అర్థంలో మాట్లాడిన ఆయన.. తాము భారత్, రష్యాలకు దూరమైనట్లే అని వ్యాఖ్యానించారు. షాంఘై సహకార సంస్థ సదస్సులో మోదీ, పుతిన్, జిన్‌పింగ్‌లు కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసిన ట్రంప్.. ఆ మూడు దేశాలకు ఉజ్వల భవిష్యత్తు కలిగి ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ‘’భారత్, రష్యాలను చైనాకు కోల్పోయినట్లు కనిపిస్తోంది. ఆ మూడు దేశాలకు ఉజ్వల, సుసంపన్నమైన భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా’’ అని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో వ్యంగ్యంగా పోస్టు పెట్టారు. ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలపై ట్రంప్ విరుచుకుపడుతున్న వేళ.. తియాన్‌జిన్ వేదికగా జరిగిన ఎస్‌సీవో సదస్సులో రష్యా, చైనా, భారత్ అధినేతలు ఒకే వేదికపై కనిపించారు. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లపై చర్చించిన వీరు.. తామంతా ఏకతాటిపై ఉన్నట్లు సంకేతాలిచ్చారు. వీరి సమావేశంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. ట్రంప్ తీరువల్లే ఆ మూడు దేశాలు ఒక్కటయ్యాయనే వాదన కూడా అమెరికాలో వినిపించింది. ఈ నేపథ్యంలో మిత్ర దేశంగా ఉన్న భారత్ దూరమైనట్లు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.