భారత్‌లో హైదరాబాదే టాప్‌సిటీ

2

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 23(జనంసాక్షి): భారతదేశంలో నివాసానికి అత్యంత యోగ్యమైన నగరాల జాబితాలో హైదరాబాద్‌ అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నగరాల్లో నాణ్యమైన జీవనానికి అనుగుణమైన నగరాలు ఏవనేదానిపై మెర్సెర్‌ అనే సంస్థ తాజా ఓ సర్వే నిర్వహించింది. ఆ వివరాల ఆధారంగా మొత్తం 230 నగరాల జాబితాని విడుదల చేసింది. భారత్‌లో చోటు దక్కించుకున్న నగరాల్లో వరుసగా.. హైదరాబాద్‌(139), పుణె(144), బెంగళూరు(145), చెన్నై(150), ముంబై(152), కోల్‌కతా(160), ఢిల్లీ-161 ర్యాంకుల్లో ఉన్నాయి. మెరుగైన విద్యా, వైద్యం, ఉపాధి, తక్కువ నేరాల రేటు, కాలుష్యం మొదలైన అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ జాబితాను రూపొందించడం జరుగుతుంది. కాగా, ప్రపంచంలో తొలి ఐదు స్థానాల్లో ఆస్ట్రియా రాజధాని వియన్నా, స్విట్జర్లాండ్‌లోని జూరిచ్‌, న్యూజిలాండ్‌లోని అక్లాండ్‌, జర్మనీలోని మ్యునిచ్‌, కెనడాలోని వేంకోవర్‌ ఉన్నాయి. కాగా, చివరి స్థానంలో ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌ నిలిచింది. ఇదిలా ఉండగా సింగపూర్‌ సిటీ 26, మలేషియా రాజధాని కౌలాలంపూర్‌ 84, చైనా రాజధాని బీజింగ్‌ 118, శ్రీలంక రాజధాని కొలంబో 132 స్థానాల్లో ఉన్నాయి. ఈ జాబితాలో వరుసగా ఏడో సంవత్సరం వియన్నా తొలి స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం.