భారత్ అమెరికా స్నేహం నవశకం… ఒబామ
పౌర అణుఒప్పందం కీలకం… మోదీ
దిల్లీ. జనవరి 25(జనంసాక్షి): గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేంధుకు భారత పర్యటనకు విచ్చేసిన ఒబామా దిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో మోదీతో భేటీ అనంతరం సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారత్ అమెరికా స్నేహానికి తన తాజా పర్యటన ద్వారా కొత్త శకానికి తెరలేచిందన్నారు. భారత ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ఒబామా సంయుక్తంగా పాల్గొన్న మీడియా సమావేశంలో అమెరికా అధ్యక్షుడు మేరా ప్యారా భారత్ నమస్కార్ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. మోదీ ప్రసంగాన్ని ముగించిన వెంటనే ఒబమా మాట్లాడుతూ మోదీ చాయ్‌పే చర్చలో తనను ఆహ్వానించినందుకు సంతోషంగా వుందన్నారు. రెండు దేశాలు ప్రజల సాధికారతకు పాటు పాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక భారత్- అమెరికాల మధ్య పౌర అణు ఒప్పందం కీలకమని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఒబామాతో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఒప్పందం కుదిరిన ఆరుసంవత్సరాలకు మరింత ముందుకు పోవడం హర్షణీయమన్నారు. రక్షణ ప్రాజెక్టుల్లో కూడా ఇరుదేశాలు పరస్పరం సహకరించుకుంటాయన్నరు.
ప్రధానంగా మోదీ ప్రస్తావించిన అంశాలు..వాతావరణమార్పు అంశంపై భారత్‌కు ప్రత్యేక విధానముంది, రక్షణ ఒప్పందాలతో దేశీయ రక్షణపరిశ్రమలకు లాభం, భారత్‌లో రెండు సార్లు పర్యటించిన అమెరికా అధ్యక్షుడిగా ఒబామా చరిత్రలో నిలిచిపోతారు, ఉగ్రవాదంపై పోరుకు ప్రపంచదేశాలు సహకరించాలి, ఆఫ్గన్‌లో ఇరుదేశాలు కలిసి అభివృద్ధిలో పాలు పంచుకుంటామన్నారు.
ఒబామా మాట్లాడుతూ పరిశుభ్రమైన ఇంధనం కోసం కృషిచేస్తామన్నారు. ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో భారత్ సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. రక్షణ ఒప్పందాలను మరో 10 ఏళ్లు పొడిగిస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీతో కలిసి రేడియోలో భారత ప్రజలతో నేరుగా మాట్లాడుతానన్నారు. ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఉక్రెయిన్‌లో సైనికజోక్యం వుండదన్నారు. ఐరాసలో భారత్‌కు శాశ్వత సభ్యత్వంపై తమ మద్దతు ఉంటుందని అన్నారు.