భారత్‌, చీన్‌ భాయ్‌..భాయ్‌

లఢక్‌లో బలగాల ఉపసంహరణకు అంగీకరించిన చైనా
ఢిల్లీ, మే 5 (జనంసాక్షి) :
భారత్‌, చైనా ప్రభుత్వాలు తమ దళాలను ఉపసంహరించుకునేందుకు అంగీకరించాయి. ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఈ పరిణామంతో  గడిచిన మూడు వారాలుగా  ఇరుదేశాల నడుమా కొనసాగుతూ వచ్చిన వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.  ఏప్రిల్‌ 15 న దౌలత్‌ బేగ్‌  ఓల్డీ సెక్టార్‌  వద్ద వాస్తవాధీన రేఖను దాటిన చైనా దళాలు   భారత్‌ వైపు 19 కిలో మీటర్ల లోపలికి చొరబడి గుడారాలను ఏర్పాటు  చేసుకోవడంతో దేశవ్యాప్తంగా  కలకలం  రేగింది. దీంతో భారత ప్రభుత్వం కూడా ఆ ప్రాంతానికి మన సైన్యాన్ని పంపింది. చైనా దళాలకు సరిగ్గా 300 మీటర్ల  దూరంలో  భారత్‌  సైన్యం  కూడా  గుడారాలను ఏర్పాటు  చేసుకుంది. మరోపక్క ఇరు దేశాల సైనికాధికారుల మధ్య జరిగిన నాలుగు ష్లాగ్‌ మీటింగ్‌లు ఎలాంటి ఫలితాలనూ  ఇవ్వలేదు. విపక్షాల విమర్శలు, ఒత్తిడుల మధ్యభారత  ప్రభుత్వం  చైనాతో దౌత్యపరమైన  సంప్రదింపుల్ని  కొనసాగిస్తూ వచ్చింది. ఇంకోవైపు భారత్‌  విదేశాంగ మంత్రి  ఖుర్శీద్‌ పర్యటన  తర్వాత చైనా నూతన ప్రధానమంత్రి లీ కెకియాంగ్‌  మే 20 వ తేదీన భారత్‌లో  పర్యటనకు రావల్సి ఉంది. ఈ పరిస్థితుల  నేపథ్యంలో ఆదివారం  సాయంత్రం భారత్‌,  చైనాల మధ్య కుదిరిన  ఒప్పందం మేరకు దౌలత్‌  బేగ్‌  ఓల్డీ సెక్టార్‌ నుంచి  దళాల ఉపసంహరణ మొదలై రాత్రి  7.30 గంటల సమయంలో  ముగిసింది. అయితే, వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న చైనా దళాలు పూర్తిగా  వైదొలగి ముందున్న స్థానాలకు  వెళతాయా లేదా  అనేది  ఇంకా స్పష్టం కావలసి ఉంది.