భారత్ టీటీ టీమ్ ప్రాక్టీస్ షురూ వరల్డ్ జూనియర్ చాంపియన్ షిప్ కోసం రెడీ
హైదరాబాద్, డిసెంబర్ 4: వరల్డ్ జూనియర్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ కోసం హైదరాబాద్ సిధ్దమవుతోంది. భారత్‌లో తొలిసారిగా జరుగుతోన్న ఈ టోర్నీకి గచ్చిబౌలీ స్టేడియం వేదికగా నిలుస్తోంది. దీని కోసం ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ అసోసియేషన్ , శాప్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. డిసెంబర్ 9 నుండి ప్రారంభం కానున్న ఈ మెగా ఈవెంట్ కోసం భారత జూనియర్ టీమ్ తమ ప్రాక్టీస్ మొదలు పెట్టింది. చీఫ్ కోచ్ కమలేశ్ మెహాతా ఆధ్వర్యంలోని జట్టంతా స్వదేశంలో సత్తా చాటేందుకు సిధ్దమవుతున్నారు. 12 మందితో కూడిన జూనియర్ టీమ్‌లో రాష్ట్ర క్రీడాకారిణి కరణం స్ఫూర్తి కూడా చోటు దక్కించుకుంది. గత కొద్ది కాలంగా ఏపీ టీటీలో స్ఫూర్తి పలు విజయాలు సాధించడంతో జూనియర్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపిక చేశారు. ఈ టోర్నీలో భారత్ పతకం గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయని… ఆసియా దేశాల నుండి గట్టిపోటీ ఎదురవుతుందని కోచ్ కమలేష్ మెహతా అన్నారు. మరోవైపు ఈ ఛాంపియన్‌షిప్‌లో రాణించేందుకు తెలుగుతేజం స్ఫూర్తి కూడా ముమ్మరంగా సాధన చేస్తోంది. అంచనాల మేరకు రాణిస్తే పతకం గెలిచే అవకాశాలున్నాయని స్ఫూర్తి చెప్పింది. ఇదిలా ఉంటే భారత జూనియర్ జట్టులో ఉత్సాహం నింపేందుకు బ్యాడ్మింటన్ కోచ్ , ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఆరిఫ్‌చే ప్రత్యేకంగా మాట్లాడించారు. ఆరిఫ్ స్పీచ్‌ను ఆసక్తిగా విన్న యువ క్రీడాకారులు ఆయనతో తమ అభిప్రాయాలు పంచుకున్నారు. కాగా వచ్చే ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేతుల విూదుగా ఈ టోర్నీ ప్రారంభం కానుంది. దాదాపు 40 దేశాలకు చెందిన 300 క్రీడాకారులకు పైగా ఈ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్నారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే క్రీడాకారులు ప్రాక్టీస్ చేసుకునేందుకు వీలుగా 30 లక్షల ఖర్చుతో గచ్చిబౌలీ స్టేడియం ప్రాంగణంలో ప్రత్యేకంగా హాలు నిర్మిస్తున్నారు.