భారత్ బంద్ విజయవంతం
తెరుచుకోని వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు
బస్సులను అడ్డుకున్న నేతలు, అరెస్టు
హైదరాబాద్/ నల్యిడ్థిల్లీ, సెప్టెంబర్ 20 (జనంసాక్షి):
విపక్షాలు చేపట్టిన బంద్‌కు రాష్ట్రంలో మంచి స్పందన లభించింది. ప్రధాన నగరాల్లో జనజీవనం స్తంభించింది. డీజిల్ ధర పెంపు, వంటగ్యాస్‌పై పరిమితి విధింపు, రిటైల్ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడాన్ని నిరిసిస్తూ.. విపక్షాలు భారత్‌బంద్‌కు బంద్‌కు పిలుపునిచ్చాయి. రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ, టీఆర్‌ఎస్, వామపక్షాలు బంద్‌లో పాల్గొన్నాయి. చాలా వరకు బస్సులు రోడ్డెక్కలేదు. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు తెరుచుకోలేదు. ఆర్టీసీ ముందుగానే పలు బస్సు సర్వీసులను రద్దు చేసింది. లారీ యజమానులు బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు
లక్షల లారీలు రోడ్డెక్కలేదు. హైదరాబాద్, ఇతర పట్టణాల్లో ఆటోడ్రైవర్ల బంద్‌లో పాల్గొన్నారు. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, కరీంనగర్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ సహా మిగతా వర్సిటీల పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలు, పీహెచ్‌డీ అడ్మిషన్ల ప్రక్రియ వాయిదా పడింది. షాపులు, స్కూళ్లను బలవంతంగా మూసివేయిస్తున్న, బస్సులను అడ్డుకున్న పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో దాదాపు అన్ని విద్యాసంస్థలు మూతబడ్డాయి. ఆర్టీసీ పోలీసుల సూచనల మేరకు కొన్ని ప్రాంతాల్లో సర్వీసులను నడిపింది. ఎంజీబీఎస్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన 3 వేల సర్వీసులు నిలిచిపోయాయి. పోలీసు బందోబస్తుతో కొన్నింటిని మాత్రమే నడిపించగలిగారు. అయితే, సిటీబస్సులు మాత్రం యథావిధిగా తిరిగాయి. బంద్‌ను విజయవంతం చేసేందుకు తెల్లవారుజాము నుంచే విపక్ష నేతలు రోడ్డెక్కారు. అన్ని డిపోల ఎదుట బైఠాయించి, బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 60 శాతానికి పైగా బస్సులు నిలిచిపోయాయి. తెల్లవారుజామునే ఎంజీబీఎస్, జేబీఎస్‌లకు చేరుకున్న విపక్ష నేతలు బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో సీపీఐ ప్రధాన కార్యదర్శి నారాయణ, టీడీపీ నేత తీగల కృష్ణారెడ్డి, సీపీఎం నేత మధు తదితరులున్నారు. డీజిల్ ధర పెంపు, వంటగ్యాస్‌పై పరిమితిని నిరసిస్తూ గన్‌పార్కు వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. కట్టెల పొయ్యిపై వంట చేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సీపీఐ ఎమ్మెల్యేలు పాదయాత్ర చేపట్టారు. టీఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీ, లెఫ్ట్ పార్టీల నేతృత్వంలో ఎల్బీనగర్‌లో విపక్ష నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. రాస్తారోకో చేపట్టడంతో భారీగా రాకపోకలు స్తంభించాయి. ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో టీడీపీ, లెఫ్ట్ నేతలు ఆందోళనకు దిగారు. ధర్నా చేపట్టడంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో సీపీఎం ప్రధాన కార్యదర్శి రాఘవులు సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. అంతకుముందు రాఘవులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మన్మోహన్ అమెరికాకు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. సంస్కరణలపై కేంద్రం వెనక్కు తగ్గకపోతే భారీ పోరాటాలు తప్పవని హెచ్చరించారు.
విశాఖపట్నంలో బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. సీపీఐ, సీపీఎం, బీజేపీ కార్యకర్తలు రోడ్లపై బైఠాయించారు. కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆర్టీసీ డిపోల ఎదుట బైఠాయించి, బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. మరోవైపు, పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన 300 బస్సులను కూడా ఆర్టీసీ ముందుగానే రద్దు చేసింది. దీంతో రవాణ పూర్తిగా స్తంభించింది. బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు రోడ్లపైనే పడిగాపులు కాశారు. భారత్‌బంద్‌లో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. విశాఖలో ఆ పార్టీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. డీజిల్ ధరను తగ్గించాలని, వంటగ్యాస్‌పై పరిమితిని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. బంద్‌తో విజయవాడలోనూ జన జీవనం స్తంభించింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ విపక్ష నేతలు రహదారులపై బైఠాయించారు. రాస్తారోకోలు, ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్రభుత్వం తన నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని లెఫ్ట్ పార్టీలతో పాటు బీజేపీ, టీడీపీ, వైఎస్సార్ సీపీ నేతలు డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లాలోనూ బంద్ ప్రభావం బాగా కనిపించింది. ఆర్టీసీ డిపోల ఎదుట విపక్షాల నేతలు ఆందోళనకు దిగారు. దీంతో బస్సులు డిపో దాటి బయటకు రాలేదు. జిల్లా వ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలను స్వచ్ఛందంగా మూసివేసి, బంద్‌లో పాల్గొన్నాయి. ప్రకాశం, ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాలో బంద్ ప్రభావం కనిపించింది. అన్ని జిల్లాల్లో బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ను సోంపేటలో విపక్షాల నేతలు అడ్డుకున్నారు. మెదక్ జిల్లాలో బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. సదాశివపేటలో బీజేపీ కార్యకర్తలు రాస్తారోకో చేపట్టగా, సిద్ధిపేట, ప్రజ్ఞాపూర్ బస్ డిపో ఎదుట టీఆర్‌ఎస్ నేతలు బైఠాయించారు. దుబ్బాక డిపో ఎదుట మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి నేతృత్వంలో ధర్నా చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లాలోనూ బస్సులు నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా 691 బస్సులు రోడ్డెక్కలేదు. నిర్మల్ డిపో ఎదుట టీఆర్‌ఎస్ నేతలు బైఠాయించారు. మహబూబ్‌నగర్‌లో బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. తెల్లవారుజాము నుంచే టీడీపీ, బీజేపీ, టీఆర్‌ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. జిల్లాలోని 8 డిపోల పరిధిలోని 900 బస్సులు బయటకు రాలేదు. ఖమ్మం జిల్లాలోనూ బంద్ కొనసాగింది. కొత్తగూడెం, ఖమ్మం, సత్తుపల్లి డిపోల ఎదుట విపక్ష నేతలు బైఠాయించారు.