భారత్‌ బలగాలపై పాక్‌ ఆర్మీ కాల్పులు 

– కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించిన పాక్‌
– ధీటుగా తిప్పికొట్టిన భారత్‌ బలగాలు
శ్రీనగర్‌, మే21(జ‌నం సాక్షి) : పాక్‌ మరోసారి రెచ్చిపోయింది. కాల్పుల విమరణ ఒప్పందం ఉన్నా.. వాటిని ఉల్లంఘించి మరీ పాక్‌ కవ్వింపు చర్యలకు దిగుతుంది. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కాల్పులను విరమించాలని భారత సరిహద్దు భద్రత దళాన్ని 24గంటల క్రితం పాకిస్తాన్‌ వేడుకుంది. కాగా మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఆదివారం రాత్రి నుంచి భారత బలగాలపై కాల్పులకు పాల్పడుతూనే ఉంది.
జమ్ముకశ్మీర్‌లోని అర్నియా సెక్టార్‌లో గల మూడు బార్డర్‌ అవుట్‌పోస్టులపై సోమవారం ఉదయం నుంచి పాక్‌ రేంజర్స్‌ కాల్పులకు తెగబడినట్లు సీనియర్‌ బీఎస్‌ఎఫ్‌ అధికారి ఒకరు వెల్లడించారు. అయితే పాక్‌ చర్యను భారత బలగాలు సమర్థంగా తిప్పికొడుతున్నాయని చెప్పారు. ఆదివారం రాత్రి కూడా సాంబా జిల్లాలోని రామ్‌గఢ్‌ సెక్టార్‌లో పాక్‌ సైన్యం భారత బలగాలపై కాల్పులకు పాల్పడినట్లు వెల్లడించారు. మధ్యాహ్నం వరకు సరిహద్దుల్లో కాల్పులు కొనసాగుతున్నాయన్నారు. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న పాక్‌ శిబిరాలే లక్ష్యంగా బీఎస్‌ఎఫ్‌ బలగాలు కాల్పులు జరిపాయి. అఖ్నూర్‌లోని ‘చికెన్‌ నెక్‌’ ప్రాంతంలోని పాక్‌ బంకర్‌పై శనివారం భారత బలగాలు రాకెట్‌ను ప్రయోగించాయి. పాక్‌ కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడి జమ్ములో ఇద్దరు భారత జవాన్లను, మరికొందరు పౌరులను బలితీసుకోవడంతో.. దీనికి బదులిచ్చేందుకే బీఎస్‌ఎఫ్‌ ఈ చర్యకు దిగింది. దీంతో తోకముడిచిన పాక్‌ రేంజర్లు.. జమ్ములోని బీఎస్‌ఎఫ్‌ కేంద్రానికి ఫోన్‌ చేసి కాల్పులు ఆపాలని ప్రాధేయపడ్డట్లు సీనియర్‌ సైనికాధికారులు తెలిపారు. దీంతో భారత్‌ పాక్‌ శిబిరాలపై దాడులను విరమించుకుంది. కానీ మళ్లీ ఆదివారం అర్థరాత్రి నుంచి భారత్‌ భద్రతా బలగాలపై కాల్పులు జరుపుతూ పాక్‌ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది.
———————————-