భారత్ వాదన బింద్రా నోట
న్యూఢిల్లీ ,మే 3 (జనంసాక్షి):
అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్యతో తమ గుర్తింపును పునరుధ్ధరించు కునేందుకు భారత క్రీడాసమాఖ్య కసరత్తులు చేస్తోంది. దీనిలో భాగంగా భారత్ వాదనను వినిపించేందుకు ఒలింపిక్ షూటర్ అభినవ్ బింద్రాను ఎంపిక చేసింది. గత ఏడాది డిసెంబర్‌లో భారత సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఐవొసి నిర్ణయం తీసుకుంది. కామన్‌వెల్త్‌గేమ్స్‌లో భారీ అవినీతి కుంబకోణం తో పాటు ఐవొఎ సెక్రటరీ జనరల్‌గా ఎన్నికైన లలిత్ భానోత్‌పై ఆరోపణలు రావడం దీనికి కారణమైంది. అయితే ఆరోపణలు వచ్చిన సురేష్ కల్మాడీ, భానోత్‌లను తప్పించి తాత్కాలిక ప్రెసిడెంట్‌గా విజయ్‌కుమార్ మల్హోత్రా బాధ్యతలు తీసుకున్నప్పటకీ ఐవొసి గుర్తింపు లభించలేదు. దీనికి తోడు ఐవొఎ ఎన్నికల నియమావళి కూడా మరో కారణమైంది. ఏ దేశంలోనైనా ఒలింపిక్ సంఘం ఎన్నికలు ఐవొసి నిబంధనలకు అనుగుణంగా జరగాలి. కానీ భారత్‌లో కేంద్ర క్రీడాశాఖ ఆదేశాలు అనుసరించి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించడంతో ఐవొసి భారత్‌పై వేటు వేసింది. తర్వాత ఈ వివాదానికి సంబంధించి పలుసార్లు ఐవొసితో సమావేశమ య్యేందుకు భారత ఒలింపిక్ సంఘం పెద్దలు ప్రయత్నించినా ఫలితం లేకపో యింది. అనివార్య కారణాలతో ఆ సమావేశం వాయిదా పడుతూ వస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా కేంద్రక్రీడాశాఖ ఖరారు చేసిన ఐదుగురి జాబితాలో బింద్రా కూడా ఉన్నాడు. బీజింగ్ ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలుచుకున్న బింద్రా మే 15న ఐవొసి అధికారులతో జరిగే సమావేశంలో భారత్ వాదన వినిపించనున్నాడు. ఐదుగురి సభ్యుల బృందానికి క్రీడాశాఖా మంత్రి జితేందర్‌సింగ్ సారథ్యం వహిస్తారని తెలుస్తోంది. ఐవొసి నిషేధంతో ఒలింపిక్స్‌తో పాటు పలు అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొనే అవకాశాన్ని భారత క్రీడాకారులు కోల్పోయారు.