భారత్ శ్రీలంక పౌర ‘అణు’బంధం
-మోదీ, మైత్రిపాలతో చర్చలు
-శ్రీలంక అధ్యక్షుడికి ఘనస్వాగతం
న్యూఢిల్లీ,ఫిబ్రవరి16(జనంసాక్షి): శ్రీలంకకు పొరుగుదేశమైన భారత్ నుంచి ఎల్లప్పుడూ సహాయసహకారాలు అందుతాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.భారత్, శ్రీలంక దేశాల మధ్య నాలుగు ఒప్పందాలు జరిగాయని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. శ్రీలంక అధ్యక్షడు మైత్రిపాలతో సమావేశమనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ మైత్రిపాలతో తమిళ జాలర్ల అంశాన్ని ప్రస్తావించినట్టు తెలిపారు. సోమవారం ఉదయం శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, భారత ప్రధాని నరేంద్ర మోదీల భేటీ అనంతరం వారు సంయుక్త విూడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సంప్రదాయ, పునరుత్పాదక ఇంధనాల రంగంలో సహకారం విస్తృతం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలతోపాటు ఇరు దేశాల మధ్య పౌర అణు సహకారంపై ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకురావడానికి ఇది అపూర్వ అవకాశమని మోదీ అన్నారు. సిరిసేన, తాను ఇద్దరమూ జాలర్ల అంశానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని మోదీ స్పష్టంచేశారు. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో ప్రధాని హైదరాబాద్ హౌజ్‌లో సమావేశమైన విషయం తెలిసిందే. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా మైత్రిపాల సిరిసేన భారత్‌కు వచ్చారు. సిరిసేన తనను శ్రీలంక పర్యటనకు ఆహ్వానించారని.. ఈ ఏడాది మార్చిలో శ్రీలంక పర్యటనకు వెళ్తానని మోదీ తెలిపారు. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా భారత్‌లో పర్యటిస్తున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. భారత్‌తో శ్రీలంకకు సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్న నేపథ్యంలో సిరిసేన తొలి విదేశీ పర్యటనకు భారత్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల భారత పర్యటనకు విచ్చేసిన శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన దంపతులకు రాష్ట్రపతి భవన్ వద్ద రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. ఈసందర్భంగా త్రివిధ దళాల నుంచి మైత్రిపాల సిరిసేన గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత మైత్రిపాల సిరిసేన దంపతులు రాజ్‌ఘాట్‌ను సందర్శించి నివాళులర్పించారు.