భారత రాజకీయాల్లో కొత్త శక్తి
మోదీకి ముచ్చెమటలు పట్టిస్తున్న కేజ్రీవాల్
ఫలితాలకు ముందే ఓటమి అంగీకరిస్తున్న భాజపా అగ్రనేతలు
ఢిల్లీలో పాగా వేస్తే దేశానికి ఆప్ ఆశాకిరణం
దిల్లీ,ఫిబ్రవరి5(జనంసాక్షి): దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఇప్పుడు బిజెపికి అత్యవసరంగా మారింది. ఇప్పటి వరకు వివిధ రాష్టాల్ల్రో దూసుకునిపోతున్న బిజెపి విజయాలకు హస్తినలో చెక్ పడనుందని సర్వేలు వెల్లడిస్తున్న నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా బిజెపి టాప్ ఆర్డర్ అంతా ప్రచారంలో దిగింది. ఢిల్లీలో బిజెపికి ప్రధాన పోటీదారుగా ఉన్న ఆప్ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ దూసుకుపోతూ బిజెపికి ముచ్చెమటలు పట్టిస్తున్న తీరు, సర్వేల ఫలితాలు బిజెపికి కంటివిూద కునుకు లేకుండా చేస్తున్నాయి. మొదటి స్థానంలో ఆప్ ఉంటుందన్న సర్వేలు నమ్మవద్దని స్వయంగా ప్రధాని మోడీ చెప్పడం చూస్తే బిజెపి ఆత్మరక్షణలో పడిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కేంద్రంలో అధికారం చేపట్టిన 9 నెలల తరవాత తొలిసారిగా బిజెపికి ఎదురుగాలి వీస్తోందని ఢిల్లీ ఎన్నికల ప్రచార సరళి తెలియ చేస్తోంది. అమిత్‌షా వ్యూహం ఇక్కడ పనిచేయడం లేదన్నది కూడా అర్థం అవుతోంది. దేశానికి గుండెకాయలాంటి ఢిల్లీ పీఠం గుప్పిట ఉంటేనే బిజెపికి పాలనా పరంగా చిక్కులు ఉండవు. అందుకే ఇక్కడ కమలనాథులు చెమటోడుస్తున్నారు. సర్వేల గణాంకాలను తోసిపుచ్చడం లేదు. అందుకే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ పనితీరుపై రిఫరెండమ్‌గా చూడకూడదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఆప్ గెలుస్తుందని పలు సర్వేలు చెబుతున్న నేపథ్యంలో ఆయన స్పందించిన తీరు చూస్తే బిజెపిలో ఎక్కడో ఒక దగ్గర ఓటమి భయం పట్టుకుందని అర్థం చేసుకోవచ్చు. ‘మోదీ అసెంబ్లీ ఎన్నికల్లో తలపడ్డం లేదు. ముఖ్యమంత్రి ఎన్నిక కోసం జరుగుతున్నవే కానీ ప్రధాని ఎన్నిక కోసం కాదు. బీజేపీకి మిగతా వారికి మధ్య పోటీ, అంతే’ అని వెంకయ్య అనడంతో రేపటి ఫళితాలను ఇప్పుడే ఊహించారని అనుకోవాలి. ఎక్కడ గెలిచినా మోడీ, షా ద్వయం దూసుకుని పోతుందని చెప్పుకున్న వెంకయ్య ఇప్పుడు పిల్లిమొగ్గలు వేయడం చూస్తుంటే ఆప్ ప్రభావం ఢిల్లీలో బలంగా ఉందని గుర్తించాలి. అందుకే ఢిల్లీ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ దూకుడుగా ప్రచారాన్ని చేపట్టింది. ప్రధాని పలు సభల్లో ప్రసంగించారు. మోదీని శక్తిమంతుడిని చేయాలని దేశం భావిస్తోందని, ఢిల్లీ దేశ రాజధాని కనుక దానికి సహజంగానే ప్రాధాన్యమొస్తోందని వెంకయ్య సర్దుబాటు మాటలతో సరిపెడుతున్నా అలా ఉండదని గుర్తుంచుకోవాలి. అయితే గత 47 రోజుల పాలనలో కేజ్రీవాల్ అనుసరించిన తీరు, తీసుకున్న నిర్ణయాలు, ఆప్ పోరాటాలు ప్రజలను ప్రబావితం చేశాయనడంలో సందేహం లేదు. అందుకే ఆప్ ఇప్పుడు ఢిల్లీలో ప్రధాన శక్తిగా అవతరించింది. ఇక ప్రచారంలో ఆప్ తన ప్రధాన సమస్యలను ఎప్పటిలాగానే ప్రస్తావిస్తూ దూసుకుని పోతోంది. మొత్తంగా ఢిల్లీ ఎన్నికల ప్రచార ¬రు జనజాతరను తలపిస్తోంది. ఎవరు గొప్ప అన్నదే ఇక్కడ ప్రధానంగా కనిపిస్తోంది. జనం సమస్యలు హాంఫట్‌గా పరిష్కరిస్తామన్న లెవల్లో హావిూలు గుప్పిస్తున్నారు. అయితే ఇందులో ఎక్కడా కాంగ్రెస్ ప్రభావం చూపకపోవడం దాని దౌర్భాగ్యం తప్ప మరోటి కాదు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాజధానిలో మహిళల భద్రత అంశం ప్రధానంగా చోటుచేసుకుంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చినందువల్ల ఢిల్లీకి రాష్ట్ర ప్రతిపత్తి ఇచ్చే అంశాన్ని బీజేపీ ఇప్పుడు ప్రస్తావించడం లేదు. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీకి చెక్కుల రూపంలో వచ్చిన 2 కోట్ల విరాళాలపై దుమారం లేపే పనిలో బిజెపి పడింది. ఆయనను ఈ రకంగా ఎదుర్కోవాలని చూస్తున్నారు. ఈ అంశం ఆధారంగా మోడీ కూడా ఆప్‌పై విమర్శలు సంధిస్తున్నారు. ఇతర పార్టీలకన్నా నీతిమంతులమని చెప్పుకునే ఆప్ అసలు రూపం బయటపడిందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం చేస్తున్నారు. గత 16 ఏళ్ల పాపాన్ని కడిగేస్తామని వాగ్దానాలు ఇస్తున్నారు. 2 కోట్ల విరాళంపైన మాత్రమే కాదు… తమకొచ్చిన చందాల న్నిటిపైనా దర్యాప్తునకు సిద్ధంగా ఉన్నామని కేజీవ్రాల్ ప్రకటించడంతోపాటు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటుచేసి రాజకీయ పార్టీల విరాళాలపై ఆరా తీయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కేజ్రీవాల్ లేఖ రాయడంతో ఇప్పుడు ఆయన ప్రతిష్ట మరింతగా పెరిగింది. నిబంధనలు ఎన్ని ఉన్నా ప్రధాన రాజకీయ పార్టీలే విరాళాల విషయంలో పారద ర్శకతను పాటించడం లేదని దీన్నిబట్టి అర్థమవుతున్నది. మొత్తానికి ఈ వ్యవహారంలో బిజెపి దూకుడుగా ప్రచారం చేస్తూ కేజ్రీవాల్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. అయితే దీని ప్రభావం రేపటి ఎన్నికల్లో ఉంటుందా లేదా అన్నది చూడాలి. ఈ ఎన్నికల సమయంలోనే భారీ ఎత్తున నల్లధనం రంగు మార్చుకుని మొత్తం వ్యవస్థనే బలహీనపరుస్తున్నది. ఈ నల్లధనానికి… దాంతోపాటు సాగే అవినీతికి, నేర కార్యకలాపాలకూ పార్టీల కొచ్చే లెక్కచూపని విరాళాలే ప్రధాన వనరు అని నిపుణులు ఎప్పటినుంచో చెబుతున్నారు. పార్టీలన్నీ విరాళాల విషయంలో పారదర్శకంగా వ్యవహరించేలా చట్టానికి సవరణలు తీసుకురావాలి. లేకుంటే ధనప్రభావంతో ఎన్నకలు చాలా ఖరీదైనవిగా మారుతాయి. ఇకపోతే ఈ ఫలితాలు బిజెపికి అనుకూలంగా లేకుంటే మోడీ ప్రభావం తగ్గిందన్న ప్రచారం ఊపందుకోగలదు. మోడీ చేపడుతున్న కార్యక్రమాలపైనా ప్రభావం పడగలదు. అందుకే బిజెపి నేతలు ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా విమర్శలను ఎక్కుపెడుతూ, ప్రచారంలో దూసుకుని పోతున్నారు. వెంకయ్య అన్నట్గుగా కాకుండా ఓటమి జరిగితే అది మోడీపైనే ప్రభావం చూపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.