భారీగా జీతాలు పెంచనున్న బిసిసిఐ

న్యూఢిల్లీ,మే31(జ‌నం సాక్షి):  జాతీయ సెలెక్టర్లు, అంపైర్లు, రిఫరీలు, వీడియో అనలిస్టుల జీతాలు రెండింతలు పెంచేందుకు బీసీసీఐ సిద్ధమైంది. సాబా కరీం నేతృత్వంలోని క్రికెట్‌ ఆపరేషన్స్‌తో పాటు క్రికెట్‌ పరిపాలన కమిటీ(సీవోఏ) జీతాల పెంపునకు అంగీకారం తెలిపాయి. అయితే ఈ విషయం బీసీసీఐ కోశాధికారి అనిరుధ్‌ చౌదరీకి తెలియకపోవడం విశేషం. బోర్డు తాజా నిర్ణయంతో సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌తో పాటు సెలెక్టర్లకు రెండింతల వేతనాలు దక్కనున్నాయి. ప్రస్తుతం ఏడాదికి రూ.80 లక్షలున్న చైర్మన్‌ జీతం కోటికి పెరుగనుండగా, సెలెక్టర్లకు రూ.60 లక్షల నుంచి 75-80 లక్షల వరకు దక్కనుంది. కొత్త వేతన ప్రణాళిక ప్రకారం ఒక్కో ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌కు అంపైర్‌కు రూ.40వేలు, టీ20 మ్యాచ్‌కు రూ.20వేలు, ఒక్కో మ్యాచ్‌కు రిఫరీలకు రూ.30వేలు, టీ20లకు రూ.15వేలు, స్కోరర్లకు మ్యాచ్‌కు రూ.10వేలు, టీ20లకు రూ.5వేలు, వీడియో అనలిస్టులకు రూ.15వేలు, టీ20లకు రూ.7.5వేలు పొందనున్నారు.