భారీవర్షాలతో తడిసి ముద్దయిన మంథని

బ్యాక్‌ వాటర్‌తో నీట మునిగిన పట్టణం

పెద్దపల్లి,జూలై14(జనం సాక్షి): గత ఆరు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలతో మంథని జల దిగ్బంధమైంది. గోదావరి, మానేరు బ్యాక్‌వాటర్‌ తో వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తన్నది. మంథని ప్రధాన చౌరస్తాలోకి పెద్దఎత్తున వదర నీరు చేరింది. బొక్కల వాగు బ్యాక్‌ వాటర్‌తో పట్టణంలోని అంబేద్కర్‌ నగర్‌, మర్రివాడ, వాసవీనగర్‌, దొంతలవాడ, బోయిన్‌ పేట, లైన్‌ గడ్డలోని బర్రెకుంటలో ఉన్న ఇండ్లు నీటమునిగాయి. దుకాణాల్లోకి నీరు రావడంతో సామాగ్రి తడిసి ముద్దయింది. పట్టణంలోని వరద బాధితుల పునరావాస కేంద్రం, పోలీస్‌స్టేషన్‌, కూరగాయల మార్కెట్‌లోకి భారీగా వరద చేరింది. పాత పెట్రోల్‌ పంపు చౌరస్తాలోని ఇండ్లు నీటమునిగాయి. దీంతో ముంపు బాధితులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.