భారీ వర్షంతో హైదరాబాద్‌లో జనజీవనం అతలాకుతలం
ఇల్లుకూలి 9 మంది మృతి
లోతట్లు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటన
బాధితులను ఆదుకుంటామని హామీ
హైదరాబాద్, జూలై 20 (జనంసాక్షి):
ఏకధాటి వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం.. పొంగిన నాళాలు.. నిద్రలోనే తొమ్మిది మంది దుర్మరణం వంటి సంఘటనలు జంటనగరాల్లో శనివారం చోటుచేసుకున్నాయి. జంట నగరాల్లో ఏకధాటిగా 12 గంటల పాటు కురిసిన వర్షానికి జనజీవనం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లోని ఆపార్టుమెంట్లలోకి సైతం నీరుచేరాయి. కొన్ని ప్రాంతాల్లో నాలాలు పొంగిపొర్లాయి. బాలానగర్‌లో ఓ కంపెనీ గోడ కూలిన దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మియాపూర్‌లోని ఆదిత్య నగర్‌లో ఇల్లు కూలిన సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.
బాలానగర్, మియాపూర్‌లలో..
బాలానగర్‌లో ఒక కంపెనీకి చెందిన ప్రహరీ గోడ శనివారం ఉదయం కూలడంతో ఆ సమయంలో అక్కడ ఉన్న నలుగురు నిద్రలోనే కన్నుమూశారు. మరొకరు చికిత్స పొందుతూ మరణించారు. మృతుల్లో శాంతిలాల్, గోపాల్, కల్కాన్, లక్ష్మీబాయిగా గుర్తించారు. మరొకరి సమాచారం తెలియాల్సి ఉంది. వీరందరూ మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ గ్రామానికి చెందిన వారుగా అధికారులు గుర్తించారు. శిథిలాల కింద ఒకరో ఇద్దరో ఉండవచ్చన్న అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. మృతుల కుటుంబాల, బంధువుల, సహచరుల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాదంగా మారింది. శుక్రవారం సాయంత్రం నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షానికి ప్రహరీ గోడ కూలి వారిపై పడడంతో ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా మియాపూర్‌లోని న్యూ హఫీజ్‌పేటలోని ఆదిత్యనగర్‌లో ఇల్లు ఒక పక్కకు ఒరగడంతో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ముగ్గురు పిల్లలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఫరీదాబేగం(35), సురీన్(15), ముస్కాన్(5), షమీర్(8) నిద్రలోనే వీరంతా కన్నుమూయడంతో కాలనీ వాసులు ఆవేదన చెందుతున్నారు. ఇంటి యజమాని ఆ సమయంలో బయటకు వెళ్లడంతో ఆయన ఒక్కరే ఆ కుటుంబంలో మిగిలారు. వర్షానికి గోడలు నానడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు. ఈ సమాచారం అందుకున్న ఎమ్మెల్యే భిక్షపతి దుర్ఘటన ప్రాంతానికి వెళ్లి బాధితుణ్ని పరామర్శించారు.
లోతట్టు ప్రాంతాలు జలమయం..
12 గంటల పాటు ఏకధాటిగా వర్షం పడడంతో లంగర్‌హౌస్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ రోడ్లు జలమయమయ్యాయి. హబ్సీగూడలోని రవీంద్రనగర్‌లో ఉన్న ఇళ్లలోకి వరద నీరు చేరింది. అలాగే ఉప్పల్‌లోని కావేరి నగర్‌లోని ఇళ్లలోకి నీరు చొచ్చుకురావడంతో వారందరూ తమ ఇళ్లను ఖాళీచేసి వేరే ప్రాంతానికి తరలివెళ్లారు. పాఠశాలల్లోకి నీరు చేరడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. రహదారులు జలమయమవడంతో శనివారం విద్యానగర్- ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ మధ్య ట్రాపిక్ జామ్ అయింది. అదే విధంగా దిల్‌సుఖ్‌నగర్-కోఠి వరకు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ద్విచక్రవాహనదారులు అసహనానికి గురయ్యారు. నాంపల్లిలోని రైల్వే కాలనీ నీట మునిగిపోవడంతో ఉద్యోగస్తుల కుటుంబాలు నిరసన తెలిపాయి. రైల్వే వారు కాని, జీహెచ్‌ఎంసీ అధికారులు కాని వచ్చి సహాయం అందించాలని కోరారు. రామాంతాపూర్‌లోని శారదానగర్ కాలనీ నీటమునిగిపోయింది. ఖైరతాబాద్‌లోని ప్రేమ్‌నగర్‌లోని ఇళ్లు నీటిలో చిక్కుకున్నాయి. ఎల్‌బీ నగర్, చంపాపేట, మీర్‌పేట, పాతబస్తీలోని ఉప్పుగూడ, శివాజీనగర్‌లలోని ఇళ్లలో నీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. మల్లాపూర్-హబ్సీగూడ మధ్య వరదనీటితో నాళాలు పొంగి పొర్లాయి. ఈ ప్రాంతంలోని నాలా కబ్జాకు గురికావడంతో వరద నీరు అపార్ట్‌మెంట్లలోకి ప్రవహిస్తోందని స్థానికులు తెలిపారు.
పొంగుతున్న మూసీ నది
కుండపోత వర్షాలకు మూసీనది నల్లగొండ జిల్లాలో ఉప్పొంగి ప్రవహిస్తోంది. అదే విధంగా ముసారంబాగ్- అంబర్‌పేట వంతెనపై నీరు అధికంగా ప్రవహిస్తోంది.
మెట్రో పనుల వల్లే..
మెట్రోరైల్ పనుల వల్ల డ్రైనేజీ వ్యవస్థను సకాలంలో మెరుగుపరచలేకపోయామని, అందువల్లే డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయని మంత్రి మహీధర్‌రెడ్డి అన్నారు. త్వరలోనే వాటిని ఆధునికీకరిస్తామని శనివారం విలేకరులతో చెప్పారు. బాలానగర్, మియాపూర్‌లలో చోటుచేసుకున్న దుర్ఘటనల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇస్తామని జిహెచ్‌ఎంసీ కమిషనర్ కృష్ణబాబు తెలిపారు. భారీ వర్షంతో జంటనగరాలలోని 50 కాలనీలు తీవ్ర ప్రభావానికి లోనైనట్టుగా శనివారం మధ్యాహ్నం నాటికి గుర్తించామని చెప్పారు. పారిశుద్ధ్యం మెరుగు, సహాయక చర్యలపై దృష్టి పెట్టామని చెప్పారు. జీహెచ్‌ఎంసీలో ఆరు హెల్ప్ సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. జాతీయ స్థాయిలో రూపొందించిన ప్లాన్‌ను జీహెచ్‌ఎంసీ పాటించడంలేదని ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. ఇప్పటికైనా నగరంలోని లోతట్టు ప్రాంతాల అభివృద్ధికి నడుంబిగించాలని సూచించారు. రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తా, తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియనున్నట్టు విశాఖపట్టణంలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అల్పపీడన ద్రోణితో మరో 24 గంటలపాటు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు. శనివారం మధ్యాహ్నం నాటికి హైదరాబాద్‌లో 11.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని, కళింగపట్టణంలో పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు.
వరద ప్రాంతాలను సందర్శించిన సీఎం..
భారీ వర్షాలకు జలమయమైన లోతట్టు ప్రాంతాలను సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి సందర్శించారు. నగరంలోని ఖైరతాబాద్ ప్రాంతంలో ముంపు బాధితులతో ఆయన మాట్లాడారు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితులు సీఎంకు ఫిర్యాదు చేశారు. ప్రతి ఏడాది పదుల సంఖ్యలో వర్షాలకు ప్రజలు చనిపోతున్నా, ఎవరూ చర్యలు తీసుకోవడం లేదని వివరించారు. ఇప్పటికైనా మ్యాన్ హోల్స్‌ను మూసి వేయించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన సీఎం వెంటనే సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం వెంట దానం నాగేందర్ కూడా ఉన్నారు.