భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు
జోగులాంబ గద్వాల జిల్లా (జనంసాక్షి):- గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు రానుంది అని జూరాల ప్రాజెక్టు అధికారులు సోమవారం సాయంత్రం తెలిపారు. కర్ణాటకలోని ఆల్మట్టి డ్యాం ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి డ్యాంకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. వరద నీటిని దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా నారాయణపూర్ డ్యాం నుంచి దిగువన ఉన్న జూరాలకు వరద నీటిని వదులుతున్నారు. ఇప్పటికే 16 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన కారణంగా సోమవారం రాత్రి నుండి జూరాలకు క్రమంగా వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని జూరాల అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆల్మట్టి డ్యాంలో 129.72 టీఎంసీలకు గాను 89.97 టీఎంసీలనీరు నిల్వ ఉండగా.. నారాయణపూర్ డ్యాంలో 37.64 టీఎంసీలకు గాను 32.95టీఎంసీల నీరు నిల్వ ఉంది. జూరాలలో 9.67 టీఎంసీలకు గాను.. 7.079 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా జూరాలకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చే అవకాశం ఉండటంతో 10,200 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం ద్వారా సోమవారం రాత్రి నుండి రెండు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని నదీ పరివాహక ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ శాఖ ప్రముఖంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు..