భార్య చెప్పిన అబద్ధం… భర్త ప్రాణం తీసింది
హైదరాబాద్: నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. భర్తను సరదాగా ఆటపట్టించేందుకు ఓ భార్య చెప్పిన అబద్ధం అతని ప్రాణాలు తీసింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. అస్సాం రాష్ర్టానికి చెందిన మింటు సాకియా(28) బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని ఇందిరానగర్‌లో నివాసముంటూ జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. రెండేళ్ల కిందట అదే రాష్ట్రానికి చెందిన సీమాను ప్రేమించి పెళ్లి చేసుకొని నగరానికి వచ్చాడు. వీరిద్దరూ కలిసి ఇక్కడే నివాసముంటున్నారు. కాగా, విధుల కోసం వెళ్లిన మింటూ రెండు, మూడు రోజులైనా ఇంటికి తిరిగిరాలేదు. దీంతో భార్య సీమా అతనికి ఫోన్ చేసి ఇంటికి రాకపోతే తాను పుట్టింటికి వెళ్లిపోతానని బెదిరించింది. వెంటనే ఆదివారం ఉదయం మింటూ ఇంటికి వచ్చాడు. కాగా, భర్తను ఆటపట్టించేందుకు సీమ సమీపంలోనే ఉన్న స్నేహితుల ఇంటికి వెళ్లింది. ఆ విషయం తెలియని మింటూ భార్య పుట్టింటికి వెళ్లిందని భావించి, తనను నిజంగానే వదిలివేసిందని మనస్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, కాసేపటికి తిరిగి వచ్చిన భార్య సీమకు ఫ్యాన్‌కు వేలాడుతున్న భర్త మృతదేహం కనిపించింది. దీంతో ఆమె కన్నీరుమున్నీరైంది. సమాచారం అందుకున్న పోలీసులు, కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.