భిన్నత్వంలో ఏకత్వం మన బలం
మత ప్రాతిపదికన చీలకపోతే భారత్ సఫలం
అమెరికా భారత్‌లు సహజ మిత్రులు
‘అణు’బంధం బలపడింది-ఒబామా
న్యూఢిల్లీ,జనవరి27(జనంసాక్షి): భారత్, అమెరికా ప్రజలు సహజ మిత్రులని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. ఈ బంధం మరింత బలపడిందని అన్నారు. భారత్ లాంఠి దేశానికి భిన్నత్వంలో ఏకత్వం బలమన్నారు. మతప్రాతిపదికన చీలిపోకుంటే భారత్ అన్నిరంగాల్లో సఫలమవుతుందన్నారు. దిల్లీలోని సిరిఫోర్టుస్టేడియంలో ఏర్పాటు చేసిన ముఖా ముఖి కార్యక్రమంలో యువత, సామాజిక కార్యకర్తలనుద్దేశించి ఒబామా ప్రసంగించారు. బహుత్ ధన్యవాద్ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన అమెరికా అధ్యక్షడు బరాక్ ఒబామా అమెరికా ప్రజల స్నేహ హస్తాన్ని భారత ప్రజల కోసం తీసుకువచ్చినట్లు తెలిపారు. మూడు రోజుల భారత్ పర్యటనలో భాగంగా నేడు ఆయన ఢిల్లీలోని సిరి ఫోర్ట్ ఆడిటోరియంలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న తొలి అమెరికా అధ్యక్షుడిగా గర్వపడుతున్నా. అమెరికా ప్రజల స్నేహ హస్తాన్ని విూ కోసం తీసుకువచ్చా. 2010లో వచ్చినప్పుడు దీపావళి వేడుకల్లో పాల్గొన్నానని పేర్కొన్నారు. భారత్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి సహకరించేవారిలో తాము ముందుంటామని వెల్లడించారు. భారత సంస్కృతి, ప్రజారోగ్య పరిరక్షణలో భాగస్వాములం అవుతామన్నారు. అణ్వస్త్ర రహిత ప్రపంచం కోసం అమెరికా కృషి చేస్తోందన్నారు. సామాజిక మాధ్యమాలతో మన బంధం మరింత బలపడిందని వ్యాఖ్యానించారు. చంద్రుడు, అంగారకుడిని చేరిన కొన్ని దేశాల్లో భారత్, అమెరికా ఉన్నాయన్నారు. ఇరు దేశాల అభ్యున్నతి కోసం స్నేహహస్తం అందిస్తున్నట్లు చెప్పారు. భారత్‌లో ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతా పొందేలా అమెరికా సహకరిస్తుందన్నారు. భారత్‌లో రైతుల ఆదాయం పెంచేందుకు సహకరిస్తామని స్పష్టం చేశారు. మయన్మార్ శ్రీలంక, దక్షిణాసియా దేశాలకు భారత్ సహకరించాలని ఒబామా కోరారు. యువత, సామాజిక కార్యకర్తల నుద్దేశించి ఒబామా ప్రసంగించారు. నోబెల్ శాంతి పురస్కార గ్రహీత కైలాష్ సత్యార్థితో పాటు దాదాపు రెండువేల మంది హాజరయ్యారు. కార్యక్రమంలో మిషెల్ ఒబామా కూడా పాల్గొన్నారు.
భద్రతా మండలిలో భారత్‌కు మద్దతు
ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి పూర్తి మద్దతు ఇస్తామని బరాక్ ఒబామా అన్నారు. కాలుష్య రహిత ఇంధన ఉత్పత్తికి భారత్ చేస్తున్న కృషి అభినందిస్తున్నట్లు చెప్పారు. భారత్‌లో కుటుంబాలను ఐక్యంగా ఉంచడంలో మహిళలదే ప్రధానపాత్ర అని, మహిళల సమానత్వం కోసం అమెరికా కృషి చేస్తోందన్నారు. మహిళా సాధికారత సాకారమైనప్పుడు ఏదేశమైనా అభివృద్ధి చెందుతుందన్నారు. నా రంగు చూసి కించపరిచే విధంగా వ్యవహరించిన ఘటనలను చూశా… ప్రపంచంలో ఎన్నో అసమానతలు ఉన్నాయి అంటూ ఒబామా ఉద్వేగంగా మాట్లాడారు. టీ అమ్ముకున్న వ్యక్తి ప్రధాని పదవిని అధిష్టించటం భారత్‌లో సాధ్యమైంది. ఇలాంటి ప్రపంచంలో ఉన్నందుకు గర్వపడుతున్నా అని ఒబామా అన్నారు.
గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నందుకు గర్వపడుతున్నా
భారత గణతంత్ర వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న తొలి అమెరికా అధ్యక్షుడిగా గర్వపడుతున్నానని బరాక్ ఒబామా అన్నారు. ఈ సందర్భంగా గత పర్యటన అనుభవాలను ఒబామా గుర్తు చేసుకున్నారు. 2010లో భారత్ వచ్చినప్పడు దీపావళి వేడుకల్లో పాల్గొని బాంగ్రా నృత్యం చేసినట్లు చెప్పారు. ‘నాకన్నా… మిషెల్ బాగా నృత్యం చేసింది. ఈసారి అలాంటి అవకాశం రాలేదు’ అని ఒబామా అన్నారు. బహుత్ ధన్యవాద్ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించి అందరినీ ఆకట్టుకున్నారు. మూడు రోజుల భారతదేశ పర్యటనకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అద్భుతమైన ముగింపు ఇచ్చారు. నమస్తే.. బహుత్ బహుత్ ధన్యవాద్ అంటూ సిరిఫోర్ట్ ఆడిటోరియంలో ప్రసంగం ప్రారంభించి, జైహింద్ అంటూ ముగించారు. ఆయన ఒక్కో మాట చెబుతున్నప్పుడల్లా ఆడిటోరియం కరతాళ ధ్వనులతో మిన్నంటింది. అడుగుడుగునా భారతీయతను తన ప్రసంగంలో ఆయన నింపేశారు. షారుక్ ఖాన్ నటించిన దిల్వాలే దుల్హనియా లేజాయేంగే విజయాన్ని, మిల్కాసింగ్ ఒలింపిక్ పతకాలను, కైలాష్ సత్యార్థి నోబెల్ శాంతి బహుమతిని ప్రస్తావించారు. తాము ఇంతకుముందు వచ్చినప్పుడు చూసిన ‘విశాల్’ అనే బాలకార్మికుడి విజయాన్ని కూడా గుర్తుచేశారు. స్వామి వివేకానంద అమెరికాకు హిందుత్వాన్ని, యోగాను పరిచయం చేశారన్నారు. 30 లక్షల మంది భారతీయులు తమ దేశాన్ని బలోపేతం చేస్తున్నారని, అది ఎంతో గర్వకారణమని ఒబామా చెప్పారు. భారతదేశంలోని మహిళా శక్తిని వేనోళ్ల పొగిడారు. మతస్వేచ్ఛను ప్రస్తావించారు. అమెరికాలో గురుద్వారాపై దాడి దురదృష్టకరమని అభివర్ణించారు. భారతదేశంలోని యువశక్తిని, వాళ్లకున్న అవకాశాలను, సాధించగలిగిన విజయాలను అన్నింటినీ ఒకదాని వెంట ఒకటిగా గుర్తుచేశారు. భారతీయుల కష్టపడేతత్వాన్ని తాము నేర్చుకోవాలని నిజాయితీగా చెప్పారు. తాను వంటవాడి మనవడినని, మోదీ టీ అమ్ముకునే వ్యక్తి కొడుకని తమ మధ్య పోలికలను గుర్తుచేశారు.ఛాయ్ అమ్మే వ్యక్తి భారత్‌కు ప్రధానమంత్రి అయ్యారు. అదేవిధంగా వంట మనిషి మనుమడ్ని అమెరికా ప్రెసిడెంట్‌నయ్యానని ఒబామా అన్నారు. ఇలాంటి ప్రపంచంలో ఉన్నందుకు గర్వపడుతున్నానని ఆయన పేర్కొన్నారు. యోగా తీసుకువచ్చి స్వామి వివేకానంద అమెరికాకు మేలు చేశారని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. భారత సంస్కృతి, ప్రజారోగ్య పరిరక్షణలో భాగస్వాములమవుతాం. అణ్వస్త్ర రహిత ప్రపంచం కసం అమెరికా కృషి చేస్తోంది.