భూమి అమ్ముతానంటూ 50లక్షల మోసం

మోసగాడు విక్రమ్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలింపు
హైదరాబాద్‌,అగస్టు9(జనంసాక్షి): భూమి విక్రయిస్తానని చెప్పి రూ. 50 లక్షలు తీసుకుని మోసం చేసిన ఘటనలో ఓ వ్యక్తిని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాగుట్ట శిరీష్‌ హోటల్స్‌ పైవ్రేట్‌ లిమిటెడ్‌ ఎండీ డి.యుగంధర్‌ను సైనికపురి ఆర్‌.కె పురానికి చెందిన ఏ.విక్రమ్‌ 2017లో కలిశాడు. మేడ్చల్‌ ` మల్కాజిగిరి జిల్లా కాప్రా గ్రామంలోని సర్వే నెంబర్‌ 47, 141, 151, 153లలో తనకు ఎకరం ఏడు గుంటల ఖాళీ స్థలం ఉందని చెప్పాడు. ఒక ఎకరం రెండు కోట్ల రూపాయలకు విక్రయస్థానని తెలిపాడు. విక్రమ్‌ మాటలు నమ్మిన యుగంధర్‌ స్థలాన్ని కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకున్నాడు. యుగంధర్‌ అడ్వాన్స్‌గా 50 లక్షల రూపాయలను విక్రమ్‌కు బ్యాంక్‌ ఖాతా ద్వారా పంపించాడు. మూడు నెలల్లో రిజిస్టేష్రన్‌ చేయిస్తానని విక్రమ్‌ చెప్పాడు. 50 లక్షలు తీసుకున్న తరువాత విక్రమ్‌ ముఖం చాటేశాడు. దీంతో యుగంధర్‌ గత నెల 17న పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 30న విక్రమ్‌పైన వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆదివారం విక్రమ్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.