భూసర్వే రికార్డుల ప్రక్షాళన ఓ రికార్డు
రైతుల గురించి ఆలోచించిన ఏకైక సిఎం కెసిఆర్ అన్న మహ్మూద్ అలీ
పంటసాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న పోచారం
కుమరం భీమ్ జిల్లా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు
ఆదిలాబాద్,మే14(జనం సాక్షి): రైతులకు సబ్సిడీతో ట్రాక్టర్లు, 24 గంటల విద్యుత్, సాగునీరు, సకాలంలో ఎరువులు విత్తనాలు అందించడంతో పాటు పెట్టుబడి సహాయం కూడా చేస్తూ దేశంలో అందరికి ఆదర్శంగా నిలుస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ చెప్పారు. గతంలో పాలించిన కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఏనాడూ రైతులను ఆదుకోలేదని విమర్శించారు. రైతుల కష్టాలను గుర్తెరిగిన సిఎం కెసిఆర్ ఆలోచించి రైతుబంధు పథకం ప్రవేశ పెట్టారని అన్నారు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, జోగు రామన్న, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు-ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా కేవలం మూడు నెలల్లోనే భూ రికార్డుల ప్రక్షాళన పూర్తి చేసి 94 శాతం భూ వివాదాలను పరిష్కరించామని ఈ సందర్భంగా మహమూద్ అలీ చెప్పారు. పాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేశామని అన్నారు. రాబోయే రోజుల్లో వందశాతం భూ వివాదాలు పరిష్కరించి భూ వివాదాలు లేని రాష్ట్రనీగా తీర్చి దిద్దుతామని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 559 మండలాలు, 10,556 గ్రామాల్లో 1007 బృందాలతో సర్వే చేసి ఒక కోటి 42 లక్షల ఎకరాలు వివాదాలు లేని భూమిగా లెక్క తేల్చామని మంత్రి పోచారం వెల్లడించారు. 58 లక్షల మంది రైతులకు 5,730 కోట్ల రూపాయల పెట్టుబడి సహాయం అందిస్తున్నామని తెలిపారు. దేశంలో, ప్రపంచంలో ఎవరూ చెయ్యని సాహసం చేసి సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశ పెట్టారని మంత్రి పోచారం కొనియాడారు. రైతుబంధు పథకానికి బ్యాంకుల్లో నగదు కొరత, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. నీళ్లు, కరెంట్ అందజేస్తూ ఎరువుల కొరత లేకుండా రుణమాఫీ చేసి నేడు రెండు పంటలకు పెట్టుబడి సహాయం అందజేస్తున్న ఘనత తమదేన్నారు. కొమురం భీం జిల్లాను వ్యవసాయ రంగం లో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, స్పెషల్ కోటా కింద డ్రిప్ ఇరిగేషన్ ,కేవీకే మంజూరు చేస్తానని మంత్రి హావిూ ఇచ్చారు. ఆర్వోఎఫ్‌ఆర్ కింద ఉన్న 12 వేల ఎకరాల భూములకు కూడా పెట్టుబడి సహాయం అందజేస్తామని గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. భూ రికార్డుల ప్రక్షాళనను పకడ్బందీగా పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ప్రతిష్ఠాత్మకంగా తీసుకవచ్చిన, వ్యవసాయ పెట్టుబడి రాయితీ కింద అందజేస్తున్న ఎకరానికి రూ.4 వేల రూపాయలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి సూచించారు.ప్రతి రైతుకు పెట్టుబడి సాయం ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు నగదును చెక్కు రూపంలో అందజేస్తుందని గుత్తా తెలిపారు.