భూ కేటాయింపుల్లో అన్యాయం సహించం

ఏలూరు,జూలై9(జ‌నం సాక్షి): పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురవుతున్న నిర్వాసితులకు పునరావాసం కల్పించిన చోటే భూమికి భూమి చూపాలని సిపిఎం డివిజన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. 2013 భూ సేకరణ చట్ట ప్రకారం ప్రాజెక్టు ముంపునకు గురవుతున్న నిర్వాసిత కుటుంబాల వానిరి ఒకే ప్రాంతంలో పునరావాసం కల్పించాలన్నారు. పునరావాసం కల్పించిన ప్రాంతంలోనే గిరిజనులకు భూమికి భూమి చూపించాల్సి ఉండగా పునరావాసం ఒకచోట భూమి మరోచోట చూపించి గిరిజనులకు అన్యాయం చేస్తున్నారన్నారు. గిరిజనులకు భూమికి భూమి ఇవ్వాల్సి ఉండగా గతంలో చూపించిన భూమి కాకుండా ఇప్పుడు చూపిస్తున్న భూమికి పొంతన లేకుండా ఉందని వివాదాల భూమిని ప్రభుత్వం చూపించి చేతులు దులుపుకోవాలని చూస్తోందని విమర్శించారు. ఏజెన్సీలోని గిరిజనులకు ప్రభుత్వం ఇచ్చిన భూమి సాగు చేసుకునేందుకు గిరిజనులకే కౌలుకు ఇవ్వాల్సి ఉండగా గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని చట్టవిరుద్దంగా నామమాత్రపు కౌలుకు భూమిని గిరిజనేతరులకు ఇప్పిస్తూ గిరిజనులను మోసం చేస్తున్నారని అన్నారు.