భూ వివరాల్లో లోపాలుంటే సంప్రదించాలి రైతులకు అధికారుల సూచన

ఆదిలాబాద్‌,జ‌నంసాక్షి):రైతులకు సంబంధించిన భూముల వివరాల్లో ఎలాంటి తప్పులు ఉన్నా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. భూ సమగ్ర సర్వేలో సేకరించిన వివరాలను ఖాతా నంబర్ల వారీగా గత నెలలో రైతులకు అందుబాటులో ఉండేలా గ్రామ పంచాయతీలు, అంగన్‌వాడీ కేంద్రాల్లోని గోడలకు అతికించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అధికారులు అవసరమైన చర్యలు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా సర్వేలో గుర్తించిన వ్యవసాయ భూములకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీని పటిష్టంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆయా మండలాల్లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో బృందాలను ఏర్పాటు చేయనున్నారు. రెవెన్యూ గ్రామాలు రైతుల సంఖ్య మేరకు అధికారుల బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మే 10 నుంచి చెక్కులతో పాటు పాసుపుస్తకాల పంపిణీని ప్రారంభించి ఆరు రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నారు. ప్రభుత్వం ఇటీవల మూడు నెలలు పాటు భూ సమగ్ర సర్వే నిర్వహించి గ్రామాల్లోని భూముల వివరాలను సేకరించింది. సాగులో ఎంత భూమి ఉందన్నది అధికారులు నిర్ధారించారు. పంటలు సాగుచేసే రైతులకు ప్రతి పంటకు ఎకరాకు రూ.4 వేల చొప్పున రెండు పంటలకు రూ.8 వేలను పంపిణీ చేసేందుకు అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. మొదటి విడతలో పంపిణీకి సంబంధించిన చెక్కులు జిల్లా కేంద్రానికి చేరాయి. భూ సమగ్ర సర్వేలో భాగంగా అధికారులు రైతులు సాగుచేసిన భూములకు పట్టాదారు పాసుపుస్తకాలను సైతం చెక్కులతో పాటు పంపిణీ చేసేందుకు జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటు
న్నారు. పాసు పుస్తకాలు తీసుకున్న రైతుల నుంచి సంతకాలు తీసుకుంటారు. పంపిణీ రోజు గ్రామాల్లో రైతులు అందుబాటులో లేకపోతే పాసుపుస్తకాలను మూడు నెలల పాటు మండల కార్యాలయాల్లో అందుబాటులో ఉంచుతారు. ఇదిలావుంటే జిల్లాలో ఈ ఏడాది వానాకాలం పంటల సాగు ప్రణాళికను వ్యవసాయ అధికారులు రూపొందించారు. జిల్లాలో ఎక్కువగా పత్తి, సోయాబీన్‌, కంది పంటలను రైతులు సాగు చేస్తుండగా ఈ సారి పత్తి పంట సాగు తగ్గి, సోయాబీన్‌, కందిపంటల విస్తీర్ణం పెరిగింది. ఈ సంవత్సరం కంది పంటను రైతులు 24,600 హెక్టార్లలో సాగుచేస్తారని అధికారులు అంచనా వేశారు. వీటితో పాటు జొన్న 6వేల హెక్టార్లు, పెసర్లు 2 వేలు, మినుములు 2వేల హెక్టార్లు సాగు కానున్నట్లు వ్యవసాయ అధికారుల అంచనాలు చెబుతున్నాయి. జిల్లాలో 92 వ్యవసాయ క్లస్టర్‌లు ఉండగా ఏఈవోలు, ఇతర సిబ్బంది గ్రామాల్లో వివిధ పంటలను సాగుచేసే రైతులు వివరాలు సేకరించారు. ఏ పంటలను ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తారనే విషయాలను తెలుసుకున్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా వానాకాలం పంటలు సాగు ప్రణాళికలను సిద్ధం చేశారు. ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు ఎరువులను రైతులు ఎంతమేర వినియోగిస్తారనే వివరాలను రూపొందించారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను సకాలంలో పంపిణీ చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.