భూ సేకరణలో బాధితులకు పరిహారం జాప్యం
నిజామాబాద్, జనవరి 19 : భూసేకరణ విషయంలో బాధితులకు పరిహారం అందజేతలో అధికారులు జాప్యం చేయడం పట్ల ఫస్ట్‌క్లాస్ అడిషనల్ మేజిస్ట్రేట్ ఆర్డీవో కార్యాలయ ఫర్నీచర్ స్వాధీనానికి ఆదేశాలు జారీ చేసింది. నిరుపేదలకు ఇండ్ల స్థలాల అందజేతలో గ్రామస్థుల నుంచి సేకరించిన భూములకు పెరిగిన ధరలతో చెల్లింపులు చేయాలని భూములను విక్రయించిన రైతులు కోర్టును ఆశ్రయించారు. బి.వెంకమ్మ, శివ, షరీఫ్, చిన్న సాయన్న, చంద్రశేఖర్, చిన్నమల్లయ్య తదితరుల నుంచి నిజామాబాద్ ఆర్డీవో అధికారులు రైతుల వద్ద నుంచి భూములను సేకరించారు. ఈ భూములకు సంబంధించిన అప్పటి ధరల ప్రకారం రైతులకు డబ్బులు చెల్లించారు. అయితే ప్రభుత్వం చెల్లించిన ధర కంటే భూముల ధర ఎక్కువగా ఉందని ఈ ధరను కట్టి తమకు చెల్లించాలని కోరుతూ కోర్టుకు వెళ్లారు. రైతులు, ప్రభుత్వ ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు పెరిగిన భూముల ధరలకనుగుణంగా డబ్బులు చెల్లించాలని నిజామాబాద్ ఆర్డీవో అధికారులకు గతంలో ఆదేశించారు. ఈ ఆదేశాలు పట్టించుకోకుండా జాప్యం చేసిన సంబంధిత అధికారులకు నోటీసులు అందజేశారు. అదే విధంగా సంబంధిత ఆస్తులను కూడా జప్తు చేయాలని ఆదేశించారు. అప్పటికీ అధికారులు స్పందించకపోవడం వల్ల శనివారం నాడు ఫస్ట్ క్లాస్ అడిషనల్ మేజిస్ట్రేట్ కార్యాలయంలోని ఫర్నీచర్‌ను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించడంతో శనివారం మధ్యాహ్నం కోర్టు సిబ్బంది ఆర్డీవో కార్యాలయానికి తరలివచ్చి కార్యాలయంలోని కుర్చీలు, టేబుళ్లు, కంప్యూటర్‌లను స్వాధీనం చేసుకున్నారు.