భోధన్‌లో ఉద్రిక్తత..
` 144 సెక్షన్ విధింపు
బోధన్,మార్చి 20(జనంసాక్షి):నిజామబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది.శివాజీ విగ్రహం తొలగించాలని ఓ వర్గం పట్టుబట్టగా… మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. వాగ్వాదం క్రమంగా ఘర్షణగా మారి రెండు వర్గాల వారు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు. పరిస్థితి అదుపుతప్పుతుందని భావించిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. ఓ వర్గం వారు పోలీసులపైకి రాళ్లు రువ్వటంతో లాఠీ ఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. అయినా ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో టియర్ గ్యాస్ ప్రయోగించి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉందని నిజామాబాద్ సీపీ నాగరాజు తెలిపారు. పాలనాపరమైన అనుమతులు ఉంటేనే ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటుకు అనుమతిస్తాని సీపీ స్పష్టం చేశారు.