మంగళూరులో33 సెంటీవిూటర్ల వర్షం నమోదు

బెంగళూరు,మే31(జ‌నం సాక్షి):  కర్ణాటకలో ఒకేరోజు 33 సెంటీవిూటర్ల వర్షం కురిసింది. రేవునగరి మంగళూరు చరిత్రలో ఇది రికార్డు అని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గత ఒకటిన్నర దశాబ్ద కాలంలో ఒకే రోజున ఇంత అధికంగా వర్షం కురవడం చూడలేదని నగర ప్రజలు తెలిపారు. మంగళవారం మూడబిద్రి, పుత్తూరులో 29 సెంటీవిూటర్లు, ఉడుపి-16, కార్కళ-13, సుళ్య-12, మాదాపుర-11, కోట, శృంగేరి, కొప్ప-9 సెంటీవిూటర్ల వర్షపాతం నమోదైంది. సిరుగుప్ప తాలూకా కరూరు ఫిర్కాలో మంగళవారం రాత్రి కొద్దిపాటి వర్షపు జల్లులు పడ్డాయి. మూడు నెలలుగా కాల్వల్లో నీటి ప్రవాహం లేక, వాగులు, వంకలు ఎండిపోయి తాగునీటి కోసం అలమట్టిస్తున్న గ్రావిూణ వాసులకు ఈ వర్షం మేలు చేసినట్లయింది. తాలూకాలో కేవలం కరూరు ఫిర్కాలో మాత్రమే కొద్దిపాటి వర్షం పడటంతో సవిూపంలోని వాగుల్లో కొద్దిగా వరద నీరు ప్రవహించింది. వ్యవసాయ పనులు చేసుకునేందుకు అనుకూలంగా ఉంటుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరూరులో 20.4 మి.విూ. ఎం.సూగురు 7.2, తెక్కలకోట 3.4, కె.బెళగల్లు 3.2 మి.విూ. చొప్పున వర్షపాతం నమోదైనట్లు  తెలిపారు. మంగళవారం రాత్రి కుసిరిన వర్షాలు, వీచిన ఈదురుగాలులకు తాలూకా వ్యాప్తంగా తీవ్ర నష్టం వాటిల్లింది. గత 15 రోజుల్లో ప్రకృతి ఇలా విరుచుకుపడటం ఇది మూడోసారి. మొదటి దెబ్బ నుంచే ప్రజలు, రైతులు ఇంకా కోలుకోలేదు. రాత్రి 9గంటల నుంచి ఈదురుగాలులు ఆరంభమయ్యాయి. కొద్దిసేపటికే ఆకాశం మేఘావృతమై పెద్దఎత్తున వర్షం పడింది. సుమారు గంటన్నరసేపు ఏకధాటిగా వర్షం కురిసింది. ఈ ప్రభావంతో ప్రజలు, వ్యాపారులు తల్లడిల్లిపోయారు. కొద్దిసేపటికే ఈదురుగాలులు ఆగిపోయాయి. కాని వరుణుడు మాత్రం కరుణించలేదు. దీంతో పట్టణ శివారులోని జాతీయ రహదారి-50పై రాయచెరువు పక్కనే ఉన్న అత్యవసర కాల్వలో పెద్దఎత్తున వరదనీరు ప్రవహించింది. హంపీలోని ఎదురు బసవణ్ణ మంటపం సవిూపంలోని ఓ పురాతన మంటపంపై చెట్టు కూలింది. అలాగే హంపీ నుంచి తళవారఘట్ట వెళ్లే మార్గంలో రహదారికి అడ్డంగా చెట్టు కూలింది. తోపుడుబళ్లు గాలికి దూరంగా ఎగిరి పడడంతో వీధివ్యాపారులకు కష్టాలు తప్పలేదు.