మండలంలో కొనసాగుతున్న వైద్యశిబిరాలు

నిజామాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): నవీపేట మండల కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్ర సిబ్బందితో ఏ,బీ సెంటర్ల ఆరోగ్య కార్యకర్తలతో వైద్యశిబిర్యాలను ఏర్పాటు చేశారు. మండల వైద్యాధికారులు తరుణం నాజ్‌, అరవింద్‌ జ్వర బాధితులను పరీక్షించి మందులు ఇచ్చారు. కొందరి రక్త నమూనాలను సేకరించి పరీక్ష కేంద్రానికి పంపామని మండల వైద్యఆరోగ్య పర్యవేక్షకులు కిషన్‌, దేవేందర్‌ తెలిపారు. ఏ సెంటర్‌ వైద్య శిబిరం నవీపేట్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని మదీనాకాలనీలో ఉన్న మైనారిటీ షాదిఖానాలో ఏర్పాటు చేశారు. ఈ శిబిరం వద్ద ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో వైద్య సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత నెల 31వ తేదీ నుంచి వైద్య శిబిరం కొనసాగుతున్న మండల నాయకులు గాని, అధికారులు గాని పట్టించుకోక వైద్యసిబ్బందిపై ఆరోపణలు చేయడంతో వైద్యులు మనస్తాపం చెందుతున్నారు. మంగళవారం ఎంపీడీఓ సయ్యద్‌ సాజిద్‌ అలీ తనిఖీ చేసి సౌకర్యాల పట్ల ఆగ్రహం చెందారు. తక్షణమే వైద్య శిబిరాల వద్ద సౌకర్యాలు కల్పించాలని గ్రామ పంచాయతీ సిబ్బందిని అదేశించారు. ఈ శిబిరాల వద్ద వైద్యులు, ఆరోగ్య పర్యవేక్షకులు, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.