మండలి ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల..భన్వర్‌లాల్‌

3

హైదరాబాద్‌,ఫిబ్రవరి19(జనంసాక్షి):  తెలంగాణలో శాసనమండలి ఎన్నికల నోటిఫికేషన్‌ను  ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది. హైదరాబాద్‌, రంగారెడ్డి మహబూబ్‌నగర్‌, వరంగల్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నిక నిమిత్తం  25వ తేది వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. వచ్చే నెల 16న పోలింగ్‌ జరగనుండగా, 19న ఓట్ల లెక్కింపు ఉంటుంది. అయితే మార్చి 16న ఇంటర్‌ పరీక్షలు ఉన్న నేపథ్యంలో పోలింగ్‌ తేదిని ఒక రోజు ముందుకు జరపాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. ఎన్నికల సంఘం దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ను రాష్ట్ర ఎన్నికల సంఘం సడలించింది. ఓటర్లు అయిన గ్రాడ్యుయేట్లు, టీచర్లను ప్రభావితం చేసే నిర్ణయాలు కాకుండా ఇతర పథకాలను ప్రవేశపెట్టడానికి తెలంగాణ ప్రభుత్వానికి వెసలుబాటు కల్పించింది. అభివృద్ది, సంక్షేమ పథకాల అమలుకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అడ్డంకిగా మారిందన్న తెలంగాణ ప్రభుత్వ మొరను ఎన్నికల కమిషన్‌ అర్థం చేసుకుంది. ఈ మేరకు ఎలక్షన్‌ కమిషన్‌ ప్రభుత్వానికి గురువారం ఓ లేఖ రాసింది. ప్రభుత్వ పథకాల అమలుకు ఎన్నికల కోడ్‌ అడ్డంకిగా మారిందంటూ తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన ఎలక్షన్‌ కమిషన్‌ …ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ నిబంధనలలో స్వల్పమార్పులు చేస్తూ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది.

పట్టభద్ర ఎన్నికల్లో పోటీకి మంత్రుల విముఖం..?

మరోవైపు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి ఇద్దరు మంత్రులతో పాటు, ఎన్జీవో నేత దేవీప్రసాద్‌ కూడా విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా నేరుగా ఎమ్మెల్సీ స్థానాలను కోరుకుంటున్నారు. తెలంగాణలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి గురువారం నామినేషన్ల పర్వం ప్రారంభమయ్యింది. అయితే  పోటీ చేసేందుకు ఏ సభలోనూ సభ్యులూ కాని,  ఇద్దరు మంత్రులు ఆసక్తి చూపటంలేదు. డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు ఇప్పుడు ఆరుఎ నెలల్లోగా ఏదో ఒక సభలో సభ్యులగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే వీరు  పట్టభద్రుల నియోజకవర్గం  నుంచి పోటీ సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఎలాంటి అడ్డంకులు లేని ఎన్నిక ద్వారా మండలిలో అడుగు పెట్టాలని ఇరువురు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపిగా ఉన్న కడియం అనూహ్యంగా రాజయ్యను తప్పించడంతో డిప్యూటీ సిఎం అయ్యారు. దీంతో ఆయన నేరుగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే అవకాశం లేదు. అలాగే ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల కూడా ఏ సభలోనూ సభ్యుడిగా లేరు. మరోవైపు టీడీపీ నుంచి టీఆర్‌ఎస్లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు కూడా మంత్రి పదవి చేపట్టిన ఆరు నెలల్లో చట్టసభలో అడుగుపెట్టాల్సి ఉంది. ఖమ్మం అసెంబ్లీ నుంచి తెదేపా అభ్యర్థిగా తుమ్మల ఓటమి పాలైన విషయం తెలిసిందే. వీరిద్దరూ ఎమ్మెల్సీలుగా ఎన్‌ఇనక కావాల్సి ఉంది. అయితే పట్టభద్ర నియోజకవర్గం ద్వారా పోటీకి వీరు సుముఖంగా ఉన్నట్లు లేదు. మరోవైపు ఉద్యోగ సంఘాల నేత దేవీప్రసాద్‌ కూడా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరగా… ఆయన మాత్రం పట్టభద్రుల నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.