మండేలా ఆరోగ్యం మరింత విషమం

జోహాన్నెస్‌బర్గ్‌, (జనంసాక్షి) : దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు, నోబెల్‌శాంతి బహుమతి గ్రహీత నెల్సన్‌ మండేలా (94) ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ఊపిరితిత్తులలో ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో ఈ నెల 8వతేదీన దక్షిణాఫ్రికా ప్రిటోరియాలోని మెడి క్లినిక్‌ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే ఆయన చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆదివారం దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్‌ జుమా ఆసుపత్రికి వెళ్లారు. మండేలా ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకోవడం.. సోమవారం (ఈ నెల 24న) జాతి నుద్దేశించి ప్రసంగించడం తెలిసిందే. మండేలా వృద్ధాప్యంలో ఉన్నారనే విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. ఆరోగ్యం కోసం మనమందరం దేవుడ్ని ప్రార్థిద్దాం.. అని జాతికి పిలుపునిచ్చిన విషయం విదితమే. దీంతో మండేలా చాలా విపత్కర పరిస్థితుల్లో ఉన్నారనే విషయం స్పష్టమైంది. దక్షిణాఫ్రికా ప్రజలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. మంగళవారం ఆయన కుమార్తె మకాజివే చేసిన వ్యాఖ్యలు మండేలా ఆరోగ్య పరిస్థితిని తేటతెల్లం చేశాయి. ‘మండేలా ఈ ప్రపంచానికి ఎంతో ఇచ్చారు. ప్రస్తుతం ఒక ప్రశాంత స్థితిలో ఉన్నారు. ఇక జరగాల్సినవి సాఫీగా జరిగిపోతాయని భావిస్తున్నారు’ అని పేర్కొన్నారు. మండేలా ఆరోగ్య సమాచారం ప్రచురణలో మీడియా వైద్య నిబంధనలు అతిక్రమించిందని అధ్యక్ష కార్యాలయం ప్రతినిధి మెక్‌ మహరాజ్‌ ఒక ప్రకటనలో ఆక్షేపించారు.