మంత్రి పార్థసారథిóకి రెండునెలల జైలు
ఆర్ధిక నేరాల ప్రత్యేక కోర్టు
హైదరాబాద్, జూలై 25 : ఫెరా నిబంధనలు ఉల్లంఘన కేసులో మంత్రి పార్ధసారధికి రెండు నెలల జైలుశిక్ష, కెపిఆర్ కంపెనీకి రూ.5.15 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ నాంపల్లిలోని ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు బుధవారంనాడు తీర్పు వెలువరించింది. మంత్రి తరఫున ఆయన న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అంతేగాక పైకోర్టుకు అప్పీలుకు వెళ్లేందుకు నెల రోజుల సమయం ఇచ్చింది.
2002లో పార్ధసారధి ఎండిగా ఉన్న కెపిఆర్ ప్రొడక్ట్స్ కంపెనీ విదేశాల నుంచి కొన్ని యంత్రాలను దిగుమతి చేసుకుంది. అయితే వాటికి సుంకాలు చెల్లించకపోవడంతో ఫెరా నిబంధనలు ఉల్లంఘించారంటూ పార్ధసారధిపై ఎన్‌ఫోర్సుమెంటు డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. అందుకు సంబంధించిన చార్జిషీటును కూడా కోర్టుకు సమర్పించింది. ఈడి ఆరోపణలు రుజువు కావడంతో పార్ధసారధికి మూడు లక్షల రూపాయల మేర జరిమానా విధిస్తూ 2003లో కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే అప్పటి నుంచి నేటికీ జరిమానా చెల్లించకపోగా కోర్టు వాయిదాలకు కూడా హాజరు కాకపోవడంతో ఇటీవల ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు మంత్రికి రెండు రోజుల క్రితం నాన్ బెయిలబుల్ వారెంటు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో పార్ధసారధి కెపిఆర్ టెలీ ప్రొడక్ట్స్ ఎండి హోదాలో బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో నాంపల్లిలోని కోర్టుకు హాజరయ్యారు. అఫిడవిట్ సమర్పించారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో నాంపల్లిలోని ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు పై విధంగా తీర్పునిచ్చింది.