మంథనిలో తెలంగాణ సత్తా చాటుదాం

శిక్షణ శిబిరంలో కేసీఆర్‌ ఆవేశపూరిత ప్రసంగం
కరీంనగర్‌/మంథని, జూన్‌ 6 (జనంసాక్షి) :
శ్రీధర్‌బాబు సీమాంధ్రకనుకూలంగా ఎందుకు మారిండని టీఆర్‌ఎస్‌ అధినేత చంద్రశేఖర్‌రావు ప్రశ్నించారు. గురువారం మంథనిలో నిర్వహించిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తల శిక్షణ తరగతుల్లో కేసీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో మంథనిలో తెలంగాణ సత్తా చాటుదామని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో వంద అసెంబ్లీ, పదిహేను పార్లమెంట్‌ స్థానాలు గెలిచి తెలంగాణను సాధించుకుందామని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, దానిని మన సీట్లతో సాధించుకుందామని అన్నారు. ముఖ్యంగా తెలంగాణ కోసం గత 50 సంవత్సరాలుగా ఉద్యమం జరుగుతున్నా సీమాంధ్ర నేతలు ఎప్పటికప్పుడు అణగదొక్కుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణను కలిపే ముందు కూడా సీమాంధ్ర నేతలు కుట్ర పన్నారని అన్నారు. పదవుల కోసమే కొందరు తెలంగాణ కాంగ్రెస్‌ దద్దమ్మలు ముఖ్యమంత్రి బూట్లను నాకుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో టిడిపి, వైఎస్సార్‌ సిపిలు ఆంధ్రా పార్టీలేనని, ఒకవేళ కర్మకాలి ఆ రెండు పార్టీలు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణకు చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తారా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే దళితుడే ముఖ్యమంత్రి అవుతాడని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ పార్టీ అయినా, దానిని సీమాంధ్ర నేతలే పాలిస్తున్నారని అన్నారు. ముఖ్యంగా తెలంగాణపై చప్రాసీకి ఉన్న కనీస జ్ఞానం ప్రధానికి లేదని తాను అనడం అన్యాయమా అని అన్నారు. దానికి కొందరు ఖమ్మంలో తనపై కేసు నమోదు చేశారని, ఇలాంటి కేసులకు తాను భయపడబోనని కెసిఆర్‌ హెచ్చరించారు. మంత్రి శ్రీధర్‌బాబుకు బుద్ధి, జ్ఞానం లేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడని శ్రీధర్‌బాబు తెలంగాణ వ్యక్తి కాడా అని దుయ్యబట్టారు. తెలంగాణను సాధించుకునేందుకు ఓటే బ్రహ్మాస్త్రామవుతుందని కెసిఆర్‌ అన్నారు. నిజాం కళాశాల మైదానంలో వర్షం కారణంగా కొందరు నేతలు మాట్లాడకపోవడంపై శ్రీధర్‌బాబు రాద్ధాంతం చేస్తున్నాడని మండిపడ్డారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన వెంటనే మహిళలకు వంటగదులతో పాటు మరుగుదొడ్లు కూడా నిర్మిస్తామని అన్నారు. మంథని నియోజకవర్గంలో వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ కేంద్రాన్ని నెలకొల్పుతామని ఆయన స్పష్టంచేశారు. ముఖ్యంగా ఆంధ్ర కంటే తెలంగాణ నుంచే ప్రభుత్వానికి అధిక వస్తుందని స్పష్టంచేశారు. తెలంగాణ రాగానే 70 నుంచి 80 శాతం వరకు బొగ్గు గనులు తెలంగాణలోనే ఏర్పాటు చేసుకుంటామని అన్నారు. ఆంధ్రా నుంచి ఒక జిల్లాను, రాయలసీమ నుంచి ఒక జిల్లాను తాము కోరుకోవడం లేదని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్నే తాము కోరకుంటున్నామని ఆయన అన్నారు. తెలంగాణ ప్రాంతానికి ఒక్క పైసా కూడా ఇవ్వనని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి అహంకారంతో మాట్లాడితే తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్‌, టిడిపి నేతలు ఎందుకు నోరు మెదపలేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాగానే రైతులకు విద్యుత్‌ సమస్య తలెత్తకుండా చేస్తామని అన్నారు. సమైక్య రాష్ట్రంలో సొమ్ము తెలంగాణది, సోకు సీమాంధ్ర నేతలదని ఆయన మండిపడ్డారు. ఓట్లతోనే సీట్లు సాధించుకుని, సీట్లతోనే కేంద్ర ప్రభుత్వాన్ని శాసించి తెలంగాణను సాధించుకుంటామని కెసిఆర్‌ అన్నారు. ఈ సమావేశంలో కె.కేశవరావు, వివేక్‌ తదితరులు పాల్గొన్నారు.