మందా, కేకే, వివేక్‌, వినోద్‌కు పచ్చజెండా

టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారు

జూన్‌ 2.. నిజాం కాలేజే వేదిక

రాజయ్యకు బెర్త్‌ ఖరారు కాలేదు

వీరి రాక వెయ్యి ఏనుగుల బలం : కేసీఆర్‌

మేం దళితులమైనందుకే అవమానించారు : మందా

హైదరాబాద్‌, మే 30 (జనంసాక్షి) :

టీ కాంగ్రెస్‌ ఎంపీలు మందా జగన్నాథం, డాక్టర్‌ జి. వివేకానంద, సీడబ్ల్యూసీ మాజీ సభ్యుడు కె. కేశవరావు, మాజీ మంత్రి గడ్డం వినోద్‌ టీఆర్‌ఎస్‌లో చేరేందుకు పచ్చాజెండా ఊపారు. ఉద్యమ పార్టీలో వీరి చేరికకు ముహూర్తం కూడా ఖరారైంది. జూన్‌ 2న నిజాం కాలేజీ మైదానం వీరి చేరికకు వేదికగా మారనుంది. అయితే వీరితో పాటే పార్టీ వీడేందుకు సిద్ధపడిన వరంగల్‌ ఎంపీ రాజయ్యకు సీటు ఖరారు కాకపోవడంతో ఆయన చేరికపై సస్పెన్స్‌ నెలకొంది. తెలంగాణకు చెందిన ఎంపీలు, సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు తెలంగాణ ఉద్యమం కోసం నడుం బిగించడం ఆనందంగా ఉందని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఎంపీ వివేక్‌ ఇంట్లో కాంగ్రెస్‌ ఎంపీలు, సీనియర్‌ నేతలతో సమావేశం అనంతరం కేసీఆర్‌, ఎంపీలు వివేక్‌, మందా జగన్నాథం, కేకేతో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఇస్తామని ఇచ్చిన మాటను కాంగ్రెస్‌ తప్పడం వల్లే ఎంపిలు, సీనియర్‌ నేత కేకే తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తూనే పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నట్లు కేసిఆర్‌ పేర్కొన్నారు. వీరి రాకతో తెలంగాణ ఉద్యమానికి వెయ్యి ఏనుగుల బలం వచ్చిందని అన్నారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ ఇచ్చిన వాగ్దానాన్ని మరిచిపోయినందునే పార్టీని వీడుతున్నారని, స్వపక్షంలో ఉండికూడా పార్లమెంట్‌లో ఎన్నోరకాలుగా ఉద్యమాలు చేస్తే పట్టించుకోక పోవడం శోచనీయమన్నారు. ఎంపిలు వివేక్‌, మందాజగన్నాథంతో పాటు మాజీ మంత్రి వినోద్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేకేలు టీఆర్‌ఎస్‌లో చేరడం చిల్లరమల్లర చేరికలుగా భావించబోమన్నారు. తెలంగాణకోసం ఒక్కటి అవుతున్నట్లుగానే తాము బావిస్తామన్నారు. కాంగ్రెస్‌ ఎంపీలు గత కొంతకాలంగా బరిగీసి తెలంగాణ కావాలని అడుగుతున్నా కూడా పట్టించుకోక పోవడం బాధాకరమన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణాకోసం పాటు పడే వారంతా ఒకే వేదికపైకి రావాలని తాను కోరుతున్నట్లుగా చాలామంది వస్తారన్నారు. కేవలం ప్రజలే లక్ష్యంగా ఉద్యమం కొనసాగుతుందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం ఇంకా అనేక పార్టీలకు చెందిన వారు టీిఆర్‌ఎస్‌లో చేరనున్నారని కేసిఆర్‌ ప్రకటించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం చేయాల్సిన పనులన్నీ చేస్తున్నట్లు ప్రజలను నమ్మించిన కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఆచరణలో మాత్రం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరించిందని నాగర్‌కర్నూల్‌ ఎంపీ మందా జగన్నాథం ఆరోపించారు. ఎంపీ వివేక్‌ గృహంలో సుదీర్ఘ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీమాంధ్రకు చెందిన ఎంపి కావూరి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగానే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, సోనియాగాంధీ కార్యాలయం నుంచి కదిలినట్లు ముగ్గురు దళిత ఎంపీలం ఆందోళన చేస్తుంటే పట్టించుకున్న పాపాన పోవడంలేదని అన్నారు. అంటే కాంగ్రెస్‌కు అగ్రవర్ణాలపై ఏమేరకు ప్రేమ ఉందో అర్థం అవుతుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎప్పటికి అగ్రవర్ణాల పార్టీయేనని తమతో అధిష్టానం వ్యవహరించిన తీరుతో తేటతెల్లం అయిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చినహావిూనే తాము అమలు చేయాలని కోరుతున్నామే తప్ప మరోటి కాదన్నారు. ఇందులో తమకు స్వార్థం లేదన్నారు. కాంగ్రెస్‌ను ప్రజల్లో నిలబెట్టేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నా కూడా అధిష్టానం పట్టించు కోవడంలేదన్నారు. 2009 డిసెంబర్‌ 9న కేంద్ర ¬ంమంత్రి చిదంబరం చేసిన ప్రకటనను అమలు చేయాలని ఇంతకాలం పార్టీలో ఉంటూనే ఒత్తిడి చేసినా కూడా లెక్కచేయక పోవడం విచారకరమన్నారు. పార్లమెంట్‌మెట్లపైన 48 గంటల పాటు నిరసన దీక్షచేసినా ఖాతరు చేయక పోవడం బాధ కలిగించిందన్నారు. అగ్రవర్ణాలే కాంగ్రెస్‌కు ప్రధానమా అని కాంగ్రెస్‌ను నిలదీశారు. చరిత్రలో ఏనాడు లేనివిదంగా డెప్యూటీ పీఎం ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌ను తీసుకువచ్చిన వ్యక్తికి, అలాగే తెలంగాణ అంశంపై ముగ్గురు దళిత ఎంపీలు హైకమాండ్‌ను ప్రశ్నిస్తే స్పందించక పోగా పాతనీరు పోతుంది.. కొత్తనీరు వస్తుందని ప్రకటించడం తమను ఎంతో బాధ కలిగించిందన్నారు. పాతనీరు పోతే కొత్తనీరు వస్తే వస్తుంది కావచ్చు కాని అసలు నీరే లేనప్పుడు బీటలు వారడం ఖాయమని తెలుసుకోవాలని బొత్స సత్యనారాయణకు హెచ్చరికలు జారీచేశారు. కాంగ్రెస్‌ పార్టీని రక్షించాల్సిన స్థానంలో రాష్ట్ర అధ్యక్షుడి స్థానంలో ఉన్న బొత్స అలాంటి వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్‌ పార్టీ నైజానికి నిదర్శంగా చెప్పుకోవచ్చన్నారు. నైతిక బాధ్యతను బొత్స ఏమేరకు ప్రయత్నిస్తున్నాడో ఆయన వైఖరిని చూస్తేనే తెలుస్తుందన్నారు. 120కోట్ల మంది ప్రజలకు వేదిక అయిన పార్లమెంట్‌లో ¬ంమంత్రి, రాష్ట్రపతి చేసిన ప్రకటనను అమలు చేయాలని కోరితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూనే వస్తోందన్నారు. ఇచ్చిన మాటలను అమలు చేయాల్సిన నైతిక బాధ్యత కాంగ్రెస్‌పై లేదా అని జగన్నాథం ప్రశ్నించారు. ఎన్నోరకాలుగా ఉద్యమాలు చేసినప్పటికీ కాంగ్రెస్‌ అధిష్టానం మాత్రం తెలంగాణా విషయంలో తేల్చక పోవడం వల్లే తాము జూన్‌2వ తేదీన టిఆర్‌ఎస్‌ పార్టీలో చేరనున్నామన్నారు. తమకు పదవులు ముఖ్యం కాదని, ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల ఆకాంక్ష మేరకు పోరాటం చేయాలన్నదే అభిమతమన్నారు. తెలంగాణ ఉద్యమానికి కాంగ్రెస్‌ అధిష్టానం విలువ ఇవ్వడం లేదని తాము భావిస్తున్నామన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తెలంగాణా రాష్టాన్న్రి సాధించాలనే ఏకైక లక్ష్యంతోనే తాము పార్టీకి దూరం అవుతున్నామన్నారు. రాత్రి వరకు కూడా గడువుందనుకుంటున్నామని ఈలోగా అధిష్టానం వస్తే ఆలోచిస్తామని, లేకున్నా కూడా బాధపడబోమన్నారు.