మందులకే తడిసి మోపెడు ఖర్చు
వైద్యరంగం ఖర్చుతో కూడుకున్నదిగా మారింది. చికిత్సలు ఒక ఎత్తయితే, చికిత్సానంతరం ఔషధాల ధరలు మరో ఎత్తుగా మారాయి. సామాన్యులకు వైద్య ఖర్చులు భరించరాని వేదనగా మారుతోంది. ఇన్సూరెన్స్ చేయించుకున్నా సవాలక్ష కారణాలతో సమయానికి అందడం లేదు. ప్రభుత్వరంగంలో వైద్యం అందుబాటు లోకి రావడం లేదు. పథకాలు ప్రవేశ పెడుతున్నా అవి అమలు కావడం లేదు. కనీసం మందులన్నా చవకగా దొరుకుతాయన్న భరోసా లేదు. రోగం వస్తే చాలు మందుల కొనుగోళ్లకే ఇల్లు గుల్ల చేసుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం దాపురించింది. ప్రధానంగా ఆస్పత్రుల్లో ఎక్కువ భాగం మందులకు కూడా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇటీవలి కాలంలో మందుల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో సామాన్యలకు మందుల భారం కూడా విపరీతంగా పడుతోంది. అధికారంలో ఉన్న వారు ఎన్ని హావిూలు ఇచ్చినా ప్రజలకు మాత్రం వెతలు తప్పడం లేదు. బడా ఔషధ కంపెనీలు తమ ఉత్పాదనలను అధిక ధరలకు విక్రయించడం వల్లే ఈ పరిస్థితి నెలకొంటుంది. దీన్ని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం తక్కువ ధరకు జనరిక్ మందులను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. జనఔషధి దుకాణాలు ఏర్పాటు, జనరిక్ మందుల దుకాణాలకు విరివిగా అనుమతు లిచ్చింది. ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల చేసిన ప్రకటన తరవాత కూడా మార్పురాలేదు. జనరిక్ ఔషధాలను అందుబాటులోకి తేవడం, మందుల పేర్లను స్పష్టంగా రాయడం వంటి ఆదేశాలు ఉన్నా అవి అమలు కావడం లేదు. గ్రామాల్లో అసలు ఈవిషయాలు తెలియక పోవడంతో అమాయకులు దోపిడీకి బలవు తున్నారు. గ్రామాల్లో జనరిక్ ఔషధాలంటే ఏమిటనే స్థాయి ఇంకా ఉంది. వైద్యులు రోగికి రాసి ఇచ్చే ప్రిస్కిప్షన్‌లో విధిగా మూలకం పేరు పెద్ద అక్షరాల్లో రాయాలి.జెనరిక్ మందులను ప్రోత్సహిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించిన నేపథ్యంలో ఎంసీఐ తాజీగా ఈ ఆదేశాలను జారీ చేసింది. అవగాహన లేక ఆదరణ కరవవుతోంది. జనరిక్ మందులు అందుబాటులోకి వస్తే దాదాపుగా రోగికి సగం ఖర్చుల భారం తగ్గుతంది. కానీ ఆ దిశగా ప్రయాత్నాలు సాగడం లేదు. కనీసం ప్రభుత్వ ఆస్పత్రులకు అనుబంధంగా వీటిని అందుబాటులోకి తీసుకుని రావాలి. వైద్యులు వీటినే రాసేలా కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజలకు నష్టం తప్పేలా లేదు. అలాగే ప్రైవేట్ వైద్యులపై కఠిన చర్యలు కూడా ఉండాలి. కానీ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో మంచి రోజులు వస్తాయమని భావిస్తున్న అమలులో మాత్రం అడుగు పడడం లేదు. జనరిక్ మందులు సురక్షితమైనవే గాకుండా ప్రభావవంతం అయినవి కూడా. ఈ మందులను మాత్రమే వైద్యులు రోగికి చీటీలో స్పష్టంగా రాయాలి. ఈ మందుల విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలి. జనరిక్ ఔషధాలను అందుబాటులోకి తీసుకుని వస్తే ఈ సమస్యలు ఉండవని భావిస్తున్నారు. జన్‌ఔషధి దుకాణాల ఏర్పాటును 2007లో పార్లమెంటు ఆమోదం లభించింది. సామాన్యులకు తక్కువ ధరకు మందులను అందించే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేయడానికి ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు ఈ దుకాణాల్లో తక్కువ ధరకే దాదాపు 700 రకాలను అందుబాటులో ఉంచారు. కేవలం జన్‌ఔషధి వారు తయారు చేసిన మూలక ఔషధాలన్నీ ఇందులో లభ్యం అవుతు న్నాయి. బ్రాండెడ్ కంపెనీల మందులు, జెనరిక్ ఔషధ ధరల్లో భారీగా తేడా ఉంటుంది. పెద్ద సంస్థలు ప్రచారం, ప్రకటనలు, వైద్యులకిచ్చే పారితోషికాలు, నజరానాల విలువను కూడా ఇందులో కలిపి విక్రయించడం వల్ల వీటి ధర అధికంగా ఉంటుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో జనరిక్ ఔషధాలనే కొనుగోలు చేస్తున్నారు. వీటితో మంచి ఫలితాలు ఉండటంతో పాటు తక్కువ ధరకు వస్తున్నాయని చెబుతున్నారు. ఒక్కో వ్యాధి ఒక్కో ఔషధ మూలకంతో నయం అవుతుంది. అది నయం కావడానికి ఏ కంపెనీ అయినా
నిర్ధిష్ట మూలకంతోనే మందులను తయారు చేయాలి. జెనరిక్ ఔషధాల్లో వాడిన మూలకమే స్వదేశీ, విదేశీ కంపేనీల ఉత్పత్తిదారులు వాడుతారు. ఈ రెండింటిలోనూ మూలకం ఒక్కటే ఉంటుంది.. ధర మాత్రమే తేడా. పెద్ద ఔషధ సంస్థలు వారి ఉత్పాదనలకు ఆకర్షణీయమైన పేర్లు పెట్టుకొని ప్రచార ప్రకటనలకు భారీగా వ్యయం చేసి అత్యధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసు కుంటున్నారు. దీని కోసం పలు సంస్థలు వాటిని ఎక్కువగా విక్రయించడానికి మెడికల్ ఎక్సిక్యూటివ్‌లను నియమించుకొని వారితో వైద్యుల వద్ద విస్తృత
ప్రచారం చేయిస్తున్నారు. తమ మందులు విక్రయింపచేస్తే కొంత శాతం నగదు నజరానా ఇస్తామని, విదేశీ పర్యటనలు ఉంటాయని లేదా విలువైన వస్తువులు అందచే స్తామని, స్కీంలుఎరచూపి వైద్యులతో తమ సంస్థ మందులు విక్రయమయ్యేలా చేస్తున్నారు. వీటికి కొందరు వైద్యులు ఆకర్షితులై వాటినే ప్రోత్సహిస్తు న్నారు. వారి లాభం కోసం వీటిని రోగులకు అంటగడుతున్నారు. సామాన్యులు మాత్రం వైద్యుల స్వార్థంతో ఆర్థికంగా నష్టపోయి ఇల్లుగుల్ల చేసుకుంటున్నారు. గర్భిణులకు రక్తహీనత నివారించడానికి ఎక్కువగా రాసే ఐరన్‌ఫోలిక్ మాత్రలు జనరిక్‌వి అయితే రూ.40కి పది లభిస్తుండగా, బ్రాండెడ్ మాత్రలు రూ.100 వరకు ధర ఉంటుంది. మార్కెట్‌లో లభించే మందులతో పోలిస్తే జెనరిక్ మందులపై 40 నుంచి 80 శాతం తక్కువ ధరకు లభిస్తాయి. బహుమతుల రూపంలో భారీగా లాభం చేకూరుతుండటంతో వైద్యులు సైతం వాటి వినియోగానికే ప్రాధాన్యమిస్తున్నారు. ప్రాణాలతో చెలగాటం ఎందుకని భయపడి వైద్యులు ఏవి సూచిస్తే వాటినే రోగులు విధిలేక వాడుతున్నారు. మరోవైపు నర్సింగ్¬ంలు, ఆసుపత్రులు నిర్వహించే వైద్యులందరికి దాదాపుగా వారి సొంత దుకాణాలే ఉన్నాయి. జెనరిక్ ఔషధాల విక్రయం వల్ల తక్కువ లాభం వస్తుందని.. వాటిని ప్రోత్సహించటానికి ఆసక్తి చూపడం లేదు. పెద్ద ఔషధ కంపనీలు భారీగా ప్రకటనలతో పాటు తమ ఉత్పాదనలను విక్రయించుకోవడానికి వైద్యులకు భారీగా నజరానాలు ప్రకటిస్తూ రోగులను ఆర్థికంగా దివాలా తీయిస్తున్నాయి.