65లక్షల ఓటర్ల సమాచారం ఇవ్వాలి
ఆగష్టు 14(జనం సాక్షి)బిహార్‌లో ఓటర్ల ప్రత్యేక సవరణకు సంబంధించిన వివాదంపై ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టుకు గురువారం తన వాదలను సమర్పించింది. పలు నిర్ణయాలు తీసుకునే అధికారం తమకు ఉందని ఈసీ పేర్కొంది. చనిపోయిన, వలస వచ్చిన, బదిలీ అయిన ఓటర్ల జాబితాను సుప్రీంకోర్టుతో పంచుకునేందుకు ఈసీ అంగీకరించింది. ఈ సందర్భంగా ఈ నెల 19 వరకు ఓటర్ల జాబితా నుంచి తొలగించబడిన 65లక్షల మంది ఓటర్ల గుర్తింపును బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు ఈసీని ఆదేశించింది. ఆగస్టు 22 నాటికి సమ్మతి నివేదికను సమర్పించాలని సూచించింది. విచారణ సందర్భంగా రాజకీయ ద్వేషపూరిత వాతావరణంలో పని చేస్తున్నప్పటికీ.. వివాదాస్పదం కానీ నిర్ణయం ఏదీ లేదని ఈసీ పేర్కొంది. రాజకీయ పార్టీల మధ్య సంఘర్షణలో చిక్కుకున్నామని.. వారు గెలిస్తే ఎంవీఎంలు మంచివని అంటారని.. లేకపోతే నిందలు వేస్తారని ఆరోపించింది.
ఓటర్ల ప్రత్యేక సవరణ నేపథ్యంలో బిహార్‌లో దాదాపు 6.5కోట్ల మంది ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని ఎన్నికల సంఘం తెలిపింది. అయితే, చనిపోయిన, వలసవచ్చిన, బదిలీ ఓటర్ల వివరాలను ఎందుకు చెప్పడం లేదని ఈసీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. డిస్‌ప్లే బోర్డులు, వెబ్‌సైట్‌లో ఈ పేర్లను ఎందుకు అందుబాటులో ఉంచలేరని నిలదీసింది. దాంతో బాధితులు 30 రోజుల్లో దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు వీలుంటుందని.. చనిపోయిన, బదిలీ అయిన, వలస వెళ్లిన వ్యక్తుల జాబితాను రాజకీయ పార్టీలకు ఇచ్చామని ఈసీ సర్వోన్నత న్యాయసానికి తెలిపింది. దీనికి న్యాయస్థానం స్పందిస్తూ పౌరుల హక్కులు రాజకీయ పార్టీల కార్యకర్తలపై ఆధారపడి ఉండకూడదని తాము కోరుకుంటున్నామని పేర్కొంది. డిస్‌ప్లే బోర్డులు, వెబ్‌సైట్‌లో పేర్లను ప్రదర్శించడం వల్ల అనుకోకుండా జరిగిన తప్పులను సరిదిద్దుకునే అవకాశం లభిస్తుందని.. ఈ విషయంలో సదరు ఓటర్ల కోసం పబ్లిక్ నోటీసు జారీ చేసే విషయాన్న పరిశీలించాలని ఈసీకి సూచించింది.