యూరియా కోసం రైతుల తిప్పలు

నారాయణపేట ఆగష్టు 12(జనం సాక్షి)నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని తీలేరు సింగల్ విండో కార్యాలయానికి బుధవారం 300 బస్తాల యూరియా రావడంతో ఇప్పటికే ఎదురుచూస్తున్న రైతులు భారీగా అక్కడికి చేరుకున్నారు. యూరియా కొనుగోలు కోసం తిప్పలు పడుతున్నారు. చెప్పులను, వాటర్ బాటిల్లను క్యూలైన్‌లో పెట్టి పడిగాపులు కాస్తున్నారు. స్పందించిన సిబ్బంది ఒక్కో రైతుకు మూడు బస్తాల చొప్పున యరియాను పంపిణీ చేశారు.

ఒక బస్తా యూరియాను రూ.267కు విక్రయించారు. కోయిల్ సాగర్ తీర ప్రాంతంలో రైతులు అధిక మొత్తంలో వరిసాగు చేస్తుండటంవల్ల యూరియా కొరత ఏర్పడింది. ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో యూరియా లభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

ప్రభుత్వ వైఫల్యంతోనే యూరియాకు కృత్రిమ కొడత ఏర్పడిందని రైతులు విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు యూరియా అందుబాటులో ఉంచి ఇబ్బందులను తీర్చాలని కోరుతున్నారు. యూరియా కోసం పెద్ద ఎత్తున సహకార సంఘానికి రైతులు చేరుకున్నారు.