వాహనదారులకు షాక్‌ ఇచ్చిన రవాణాశాఖ

ఆగష్టు 14(జనం సాక్షి)వాహనదారులకు రవాణాశాఖ షాక్‌ ఇచ్చింది. కొత్తగా కొనుగోలు చేసే వాహనాల రిజిస్ట్రేషన్‌ లైఫ్‌ ట్యాక్స్‌ భారీగా పెంచింది. పెంచిన పన్ను నేటి (ఆగస్టు 14) నుంచి అమలులోకి రానున్నది. వ్యక్తిగత బైకులపై రవాణాశాఖ భారీగా లైఫ్‌ ట్యాక్స్‌ను టాక్స్‌ను పెంచింది. ద్విచక్ర వాహనాలు, కార్లకు సంబంధించిన లైఫ్‌ టాక్స్‌ స్లాబ్‌లను మార్చింది. అదే సమయంలో ఫ్యాన్సీ నంబర్లకు సంబంధించిన ఫీజులను సైతం రవాణాశాఖ పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ద్విచక్ర వాహనాలు రూ.లక్షలోపు (ఎక్స్‌షోరూం ధర) ఉన్న వాహనాలపై అదనపు భారం మోపకుండా కాస్త కనికరం చూపింది. లక్ష దాటిన బైక్స్‌లపై మాత్రం టాక్స్‌లు పెంచింది

.రూ.50వేల లోపు వాహనాలకు పాత పన్ను 9శాతం ఉండగా.. కొత్త పన్ను సైతం 9శాతం ఉండనున్నది. రూ.50వేల నుంచి రూ.లక్షలోపు వాహనాలకు పాత పన్ను 12శాతాన్నే కొనసాగించింది. రూ.లక్ష దాటిన వాహనాలపై 3శాతం టాక్స్‌ను పెంచింది. పాత పన్ను విధానం ప్రకారం 12శాతం ఉండగా.. దీన్నీ 15శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రూ.2లక్షలపైగా ఉండే వాహనాలకు పాత పన్ను 12శాతం ఉండగా.. కొత్త పన్ను 15శాతానికి పెంచింది. అదే సమయంలో వ్యక్తిగత కార్ల లైఫ్‌ ట్యాక్స్‌ను సైతం రవాణాశాఖ భారీగా పెంచింది. రూ.10లక్షలలోపు వాహనాలకు ఎలాంటి ప్రభావం ఉండదు. పాత పన్నులనే కొనసాగించింది. రూ.20లక్షల్లోపు వాహనాలకు పాత పన్ను 17శాతం ఉండగా.. ఒకశాతం పెంచడంతో 18శాతానికి పెరిగింది. రూ.20లక్షలకుపైగా ఉండే వాహనాలకు పాత పన్ను 18శాతం ఉండగా.. కొత్త పన్ను 20శాతానికి పెంచింది.

రూ.50లక్షలకుపైగా ఉండే కార్లకు పాత పన్ను 18శాతం ఉండగా.. కొత్త పన్నును 21శాతానికి పెంచుతూ ఆదేశాలు ఇచ్చింది. అదే సమయంలో ఫ్యాన్సీ నంబర్ల ఫీజులు సైతం పెరిగాయి. ఇంతకు ముందు ఐదుశ్లాబులు ఉండగా.. (రూ.50 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు) ఉండగా.. వీటిని ఏడు శ్లాబులు (రూ.1.50 లక్షలు, రూ.1 లక్ష, రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.6 వేలు)గా మార్చింది. 9999 వంటి నంబర్లకు ప్రస్తుతం రూ.50వేలకుపైగా చెల్లించాల్సి ఉండగా.. ఇక ముందు రూ.1.50లక్షలు కోట్‌ చేయాల్సి ఉంటుంది. ఒక 1, 9 వంటి నంబర్లకు రూ.లక్ష.. ఇతర ప్రీమియం నంబర్లకు రూ.50వేల నుంచి రేట్లను నిర్ణయించింది.