మట్టి గణేష్ ప్రతిమలనే ప్రతిష్టించాలి

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు 30.(జనం సాక్షి) వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతీ ఇంట్లో మట్టి వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.మంగళవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సిరిసిల్ల కుమ్మరి సంఘం వారు తయారుచేసిన మట్టి వినాయక విగ్రహాలను అధికారులు, సిబ్బందికి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారుచేసిన విగ్రహాల వాడకాన్ని తగ్గించి మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించేందుకు ప్రజలు ఆసక్తి చూపేలా అవగాహన కల్పించాలని అన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాలతో జల కాలుష్యం పెరిగి మానవాళికి ముప్పు వాటిల్లుతుందని గుర్తు చేశారు. వినాయక విగ్రహాలను మట్టితో ఆకర్షణీయంగా రూపొందించిన సిరిసిల్ల కుమ్మరి సంఘం ప్రతినిధులు శంకర్, వెంకటేశ్వర్లు, సతీష్, దేవరాజు, పర్శరాములు, సందీప్ లను కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. ఖీమ్యా నాయక్, బీసీ వెల్ఫేర్ అధికారి మోహన్ రెడ్డి, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ వినోద్ కుమార్, డీపీఆర్ఓ ఎం. దశరథం, కలెక్టరేట్ పరిపాలన అధికారి గంగయ్య, పర్యవేక్షకులు సిబ్బంది పాల్గొన్నారు.