*మట్టి మాఫియా దళారులపై కఠిన చర్యలు ఎమ్మెల్యే బొల్లం*

కోదాడ అక్టోబర్ 21(జనం సాక్షి)
 కోదాడ పట్టణంలో అక్రమ మట్టి రవాణా మాఫియా దళారులపై చట్టపరమైన చర్యలు తప్పవని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.శుక్రవారం కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తను  మాట్లాడుతూ గృహ నిర్మాణాల అవసరాలను అదునుగా చేసుకొని కొంతమంది దళారులు మట్టి మాఫియాకు తెర లేపారని అలాంటి వారిని ఉపెక్షించేది లేదని ఘాటుగా స్పందించారు. గతంలో 300 రూపాయలు ఉన్న ట్రాక్టర్ మట్టినీ దళారులు వారి జేబులు నింపుకునేందుకు అధికంగా నాలుగు రెట్లు వసూలు చేస్తూ, సామాన్య ప్రజలను దోచుకుంటున్నారని తీవ్రంగా మండిపడ్డారు.వారు చేసే కార్యకలాపాలను సంబంధం లేని వ్యక్తులపై పని కట్టుకొని బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.మన పరిసరాల ప్రాంతంలో మట్టి విషయంలో ఎటువంటి మైనింగ్ పర్మిషన్ లేకుండా కొంతమంది దళారులు పనిగట్టుకుని వ్యాపారాలు చేస్తున్నారన్నారు. ఇంటి అవసరాలకు మట్టి అవసరమైతే మున్సిపాలిటీ కమిషనర్, ఆర్డీవో అర్జీ పెట్టుకోవాలన్నారు. మట్టి ఎక్కడ ఉన్నదో తెలుసుకొని  అధికారుల అనుమతి తో మట్టిని తరలించేందుకు  వాహనదారులకు ట్రాన్స్ పోర్ట్ ఛార్జీలు చెల్లిస్తే సరిపోతుందన్నారు. దళారులకు మొత్తం డబ్బులు చెల్లించి మోసపోవద్దన్నారు. అలాంటి దళారీ వ్యవస్థను నిలదీసి అడిగే అవకాశం ప్రజలు అలవర్చుకోవాలన్నారు. అదేవిధంగా మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించబోతుందని ఆయన అన్నారు.  ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయ ఉద్దండలము మనం చెప్పుకునే నాయకులను ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఓడించిందని ఆయన అన్నారు.  ఇప్పుడు కూడా మునుగోలు టిఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని  అన్నారు. కోదాడ పట్టణంలో బాలాజీ నగర్ లో నిర్మించిన 560 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పారదర్శకతతో త్వరలో అర్హులందరికీ పంపిణీ చేస్తామని ఆయన అన్నారు.  తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాల అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ప్రజలందరూ ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.