మతపెద్దలు లక్ష్యంగా కాబూల్‌లో ఆత్మాహుతి దాడి

14మంది మృత్యువాత..పలువరికి తీవ్ర గాయాలు

కాబూల్‌,జూన్‌4(జ‌నం సాక్షి ): ఆఫ్ఘనిస్తాన్‌లో మళ్లీ దాడులతో రక్తసిక్తం అయ్యింది. దాడుల్లో సుమారు 14 మంది మరణించారు. అందులో ఏడుగురు మత గురువులు, నలుగురు భద్రతా సిబ్బంది ఉన్నారు. ఉలేమా సమావేశం కోసం హాజరైన వారిపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. దాడిలో మరణించిన మరో ముగ్గుర్ని ఇంకా గుర్తించలేదు. ఈ దాడిలో మరో 17 మంది గాయపడ్డారు. కాబూల్‌లో మతగురువులే లక్ష్యంగా సోమవారం ఉగ్రవాదులు ఈ దాడికి దిగారు. పాలిటెక్నిక్‌ యూనివర్సిటీ సవిూపంలోని లోయా జిర్గా టెంట్‌ వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ టెంట్‌ వద్ద జరిగిన సమావేశానికి భారీగా మత పెద్దలు హాజరయ్యారు. సమావేశం ముగించుకొని వెళ్తుండగా ఈ దారుణం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం పేలుడు పదార్థాలతో వచ్చిన ఓ వ్యక్తి టెంట్‌ ద్వారం వద్ద తనను తాను పేల్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ దాడిలో 14 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి పోలీస్‌ అధికారులు తెలిపారు. మృతుల్లో ఏడుగురు మత పెద్దలు, నలుగురు పోలీసులు ఉన్నారు. ఇస్లామిక్‌ చట్టం ప్రకారం ఆత్మాహుతి దాడులను నిషేధిస్తున్నట్లు మత గురువులు ఫత్వా జారీ చేసిన కొద్ది గంటల వ్యవధిలోనే ఈ దాడి జరగడం గమనార్హం. ఆత్మాహుతి దాడులు, బాంబులు పేల్చి ప్రజల ప్రాణాలు తీయడం, విభజన, తిరుగుబాటు, అవినీతి, దొంగతనం, అపహరణ, ఘర్షణలు వంటివి ఇస్లాంకు వ్యతిరేకమని అంటూ మతపెద్దలు ఫత్వా జారీ చేశారు. లోయ జిర్గా టెంట్‌ వద్ద జరిగిన సమావేశానికి దాదాపు రెండు వేల మందికి పైగా మతపెద్దలు హాజరయ్యారు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకోలేదు.