మతిస్థిమితం లేని వారి పట్ల మానవత్వం చాటుకోవాలి

చీకూరి లీలావతి
 హుజూర్ నగర్ నవంబర్ 9 (జనం సాక్షి): మతిస్థిమితం లేని వారి పట్ల ప్రతి ఒక్కరూ మానవత్వం  చాటుకోవాలని విన్నపం ఒక పోరాటం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు చీకూరి లీలావతి కోరారు. బుధవారం హుజూర్ నగర్ పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో మతిస్థిమితం లేని ఒక మహిళ తన ఒంటిపై బట్టలు లేకుండా ఉండడంతో విన్నపం ఒక పోరాటం సభ్యురాలైన ఉష, వ్యవస్థాపకురాలు చీకూరి లీలావతికి సమాచారం ఇవ్వగా  తనకు  ఒక బెడ్ షీట్, డ్రస్సు ఇంటికెళ్లి తీసుకొచ్చి ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా లీలావతి మాట్లాడుతూ తనకి బట్టలు వేసుకోవాలన్న ఆలోచన లేకపోయినా తన కడుపున పుట్టిన బిడ్డను మాత్రం మర్చిపోకుండా ఎత్తుకొని రోడ్డుపై ఉందని అమ్మ ప్రేమ ఎంత కమనీయం అయినదో ఆ తల్లిని చూస్తే తెలుస్తుందని  అన్నారు. అనంతరం తన భర్తకు సమాచారం ఇవ్వడంతో అక్కడి నుంచి తీసుకు వెళ్లడం జరిగిందని అన్నారు. ఈ విధంగా మతిస్థిమితం లేని వారు ఎవరైనా మీ గ్రామాల్లో గాని చుట్టుపక్కల ఎక్కడైనా కనిపిస్తే   వాళ్ళ ఆరోగ్య పరిస్థితి గమనించి  వాళ్లనీ హాస్పిటల్లో జాయిన్ చేపించి వారి పట్ల దయ చూపాలనీ  కోరారు.