మద్యంపై భారీగా ఆదాయం : మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్‌నగర్, ఆగస్టు 21(జనం సాక్షి)    : తెలంగాణ రాష్ట్రానికి మద్యం విక్రయాల ద్వారా భారీగా ఆదాయం పెరిగిందని అందరూ భావిస్తున్నారని అయితే ఇదంతా నకిలీ, అనుమతి లేని మద్యంపై ఉక్కుపాదం మోపడం వల్లే ఇది సాధ్యమైందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సమైక్య రాష్ట్రంలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మకాలు, గుడుంబా, సొంత లేబిళ్ల‌ ద్వారా తయారు చేసే నకిలీ మద్యం, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చే మద్యం వల్ల ఆదాయం కోల్పోయే పరిస్థితి ఉండేదన్నారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వీటన్నిటినీ కట్టడి చేయడం వల్లే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు అదనంగా ఆదాయం వస్తోందని ఆయన పేర్కొన్నారు. ఎక్సైజ్ టెండర్ల లక్కీ డ్రాకు ముందు అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించిన తర్వాత మంత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం 2620 మద్యం దుకాణాలు ఉండగా..ప్రస్తుతం 2598 దుకాణాలకు టెండర్లు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు.

ఇందుకోసం 131490 మంది టెండర్లలో పాల్గొంటున్నారని అన్నారు. 22 దుకాణాలకు తక్కువ మొత్తంలో టెండర్లు దాఖలు కావడం వల్ల వాటికి ప్రస్తుతం టెండర్లు నిర్వహిండం లేదన్నారు. అత్యంత పారదర్శకమైన నూతన ఎక్సైజ్ పాలసీని తీసుకురావడం వల్ల ఎక్కడ కూడా మద్యం దుకాణాల కోసం సిండికేట్లు కాకుండా కఠినమైన చర్యలు తీసుకున్నట్లు వివరించారు.

కలెక్టర్ల సమక్షంలో అత్యంత పారదర్శకంగా మద్యం దుకాణాల లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ దుకాణానికైనా టెండర్ వేసేందుకు హైదరాబాద్ లో ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. గెలుపొందిన వారికి వెంటనే అలాట్మెంట్ ఆర్డర్లు కూడా అక్కడే అధికారులు అందిస్తారన్నారు. టెండర్ల ప్రక్రియలో చిన్న పొరపాటు జరిగినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు.

నీరా పాలసీ తీసుకువచ్చి ఆరోగ్యకరమైన హెల్త్ డ్రింక్ అందిస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు, కల్లు గీత వృత్తిపై ఆధారపడిన గౌడ్స్ కు మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు కల్పించిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలియజేశారు.

సమైక్య రాష్ట్రంలో మద్యం మీద వచ్చే ఆదాయం అక్రమ మద్యం వ్యాపారం చేసే వారి జోబుల్లోకి పోయేదని..నకిలీ మద్యాన్ని నిరోధించినందున ప్రస్తుతం ఆ ఆదాయం అంతా నేరుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతోందని మంత్రి తెలిపారు. సమైక్య పాలనలో కొందరు రాజకీయ నేతలు అక్రమ మద్యం వ్యాపారం చేసి కోట్లు గడించేవారని గుర్తుచేశారు. అప్పట్లో కల్తీ మద్యం ఏరులై పారేదన్నారు. గుడుంబా తయారీ వల్ల జనం ప్రాణాలకు ముప్పు పొంచి ఉండేదని తెలిపారు.

అక్రమమద్యాన్ని అరికట్టడంలో సమర్థవంతంగా పనిచేస్తున్న అధికారులకు క్రమం తప్పకుండా పదోన్నతులు కూడా ఇస్తామని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో అడిషనల్ కలెక్టర్ మోహన్ రావు, ఏఎస్పీ రాములు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సైదులు, సీఐలు వీరారెడ్డి, బాలకృష్ణ, ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు.