మనువాదన్ని మార్చే కుట్ర చేస్తున్నారు : గద్దర్ కుమారుడు సూర్యం

మునిపల్లి (సంగారెడ్డి ), జనంసాక్షి :

రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేసి మనువాద రాజ్యాంగాన్ని తీసుకురాబోతున్నారని గద్దర్ కుమారుడు సూర్యం అన్నారు. కొన్ని వేల ఏళ్ళ నుంచి పేదలను బానిసలుగా వాడుకుంటున్నారాని ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డిలో జరిగిన గద్దర్ సంస్మరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తీసి మనుస్మృతిని తీసుకురావాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. దీన్ని మనం అందరం అడ్డుకోవాలని పులుపునిచ్చారు. మనం భారత రాజ్యాంగాని చదివి, మన పిల్లలతో కూడా చదివించాలని చెప్పారు. భారత రాజ్యాంగాన్ని మనం చదివి భవిష్యత్ తరాలకు అందించాలన్నారు. మన తరాలను చైతన్యం చేయడమే, మన హక్కుల కోసం పోరాటం చేస్తేనే అంబేద్కర్, గద్దర్ ఆశయాలను సాధించిన వాళ్ళం అవుతామన్నారు. మా నాన్న గద్దర్ పై కాల్పులు జరిగిన వెంటనే క్రాంతి స్పందించారన్నారు. 30 ఏళ్ళ నుంచి తాను, క్రాంతి విప్లవ బాటలో గద్దర్ వెనుకాల తిరిగామని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా గద్దర్ సభ ఏర్పాటు చేయడం గర్వంగా ఉందన్నారు. గద్దర్ పై అభిమానంతో సంస్మరణ సభ ఏర్పాటు చేసినందుకు భూమయ్య, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కు ప్రత్యేక ధన్యవాదలు తెలిపారు. అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ గద్దర్ తో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అంబేద్కర్, గద్దర్ ఆశయాలను సాధించడమే మన ముందు ఉన్న లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్, ఎమ్మెల్సీ సత్యనారాయణ,సౌత్ ఇండియా డిక్కి వైస్ ప్రెసిడెంట్ చంటి రాహుల్ కిరణ్, టీస్పీఎస్సీ సభ్యులు సత్యనారాయణ, రిటైడ్ ప్రిన్సిపాల్ అనంత్తయ్య, బీజేపీ నాయకులు జగన్, మాజీ ఎంపీపీ అశోక్, కేవీపీస్ మాణిక్యం విద్యార్థి నాయకులు పండుగ భానుతేజ, బస్వారాజ్, సురేష్, పవన్ తదితరులు పాల్గొన్నారు.