మన ఎంసెట్‌ మనమే

1
సెట్‌ల తేదీలను ప్రకటించిన ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి

హైదరాబాద్‌,జనవరి19(జనంసాక్షి): తెలంగాణలో చదువుకోవాలంటే ఇక్కడ నిర్వహించే పరీక్షలు రాయాల్సిందేనని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి స్పష్టం చేశారు. ఎంసెట్‌ సహా వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను ఆయన ప్రకటించారు. మే 14వ తేదీన ఎంసెట్‌, మే 19న లాసెట్‌, 21వ తేదీన ఈసెట్‌ నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి తెలిపారు. అలాగే.. మే 22న ఐసెట్‌, 25న పీఈ సెట్‌, జూన్‌ 6న ఎడ్సెట్‌ నిర్వహిస్తామన్నారు. ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం కోరితే.. వాళ్లకు కూడా సేవలందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పాపిరెడ్డి చెప్పారు. ఆంధప్రదేశ్‌ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఎంసెట్‌ నిర్వహణ అధికారం తమకే ఉందని  స్పష్టం చేశారు. సోమవారం  విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్వహించబోయే సెట్‌ తేదీలను ప్రకటించారు. ఈ సందర్భంగా విలేకరుల ప్రశ్నలకు సమాధానమిస్తూ… విభజన చట్టం ప్రకారం ఎంసెట్‌ నిర్వహణ అధికారం తమకే ఉందని తెలిపారు. కేంద్ర చట్టం ప్రకారం తెలంగాణలో ఉన్న ఉన్నత విద్యామండలి తెలంగాణకే చెందుతుందని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని తాము గవర్నర్‌ను కలిసినపుడు స్పష్టంగా వివరించామని తెలిపారు. ఈ విషయమై ఏపీ సర్కారు కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసిందని వివరించారు. అయినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. ఉన్నత విద్యామండలి తెలంగాణకు చెందడం న్యాయం కనుక కేంద్రం జోక్యం చేసుకోలేదని అన్నారు. ఒకవేళ ఎంసెట్‌ నిర్వహించాలని ఏపీ సర్కారు కోరితే తాము అందుకు సిద్ధంగా ఉన్నామని పాపిరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ లో ఇంజీనీరింగ్‌ లేదా ఉన్నత విద్య చదువుకోదలచిన వారు ఇక్కడ ప్రవేశ పరీక్షలు రాయవలసిందేనని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.ఎపిలో చదువుకోవాలంటే అక్కడ పరీక్ష రాయాలని పేర్కొంది.వివిద పరీక్షలకు తేదీలను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది.  తెలంగాణ ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా సొంతంగా తేదీలను ప్రకటించి, పరీక్షల నిర్వహణకు సిద్దం అవుతోంది. విభజన వల్ల అందరూ కాకపోయినా,కోరుకున్న విద్యార్ధులు రెండుచోట్ల పరీక్షలు రాయాల్సివస్తోంది.