మన చెరువుల్లో వ్యర్థ విషం
చిన్నారుల పాలిట మృత్యుశాపం
గుర్తించిన యునెస్కో
ప్రమాదకర స్థాయిలో దుర్గం చెరువు, కిష్టారెడ్డిపేట, ఖాజిపల్లి, ఆసానికుంట,
సాయి చెరువు, నూర్ మహ్మద్‌కుంట, పెద్ద చెరువు
సీమాంధ్ర పాలకుల లాభాపేక్షే కారణం
తెలిసీ గొంతు విప్పని తెలంగాణ నేతలు నోటీసులివ్వడం మినహా ఏమిచేయని పీసీబీ
హైదరాబాద్, ఏప్రిల్ 1 (జనంసాక్షి) :
భాగ్యనగరి దాహార్తిని తీర్చే జలవనరులు కాలుష్యం కోరల్లో చిక్కుకున్నాయి. ప్రజల గొంతులు తడిపే ఈ జలాలే గరళంగా మారి చిన్నారుల ప్రాణాలను బలిగొంటున్నాయి. నగరం రోజురోజుకు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోందని, లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోందని గొప్పగా చెప్పుకునే పాలకులు పారిశ్రామికీకరణ మాటున పొంచి ఉన్న ప్రమాదాన్ని మాత్రం బయటపెట్టడం లేదు. పరిశ్రమలు జలవనరుల్లోకి ఇష్టారాజ్యంగా వదిలేస్తున్న రసాయన వ్యర్థాలతో నీరంతా కలుషితమై ఫలితంగా చిన్నారులు బలిపీఠమెక్కుతున్నారనే సత్యాన్ని యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) సోమవారం బట్టబయలు చేసింది. భారతదేశంలో కాలుష్యం కోరల్లో చిక్కుకున్న చెరువుల జాబితాలో హైదరాబాద్‌లోనే ఎక్కువున్నట్లు నివేదిక పేర్కొంది. ఇందుకు కారణం సీమాంధ్ర పెత్తందారులు, పాలకుల స్వార్థమే కారణం. ఒకప్పుడు ప్రశాంతమైన పల్లెల్లా ఉండే హైదరాబాద్ శివారు ప్రాంతాలు ఇప్పుడు కలుష్య కసారాలుగా మారాయి. సీమాంధ్ర పెత్తందారులు, పెట్టుబడిదారులు, పాలకులు కుమ్మక్కై ఇక్కడి భూములను లాక్కొని ఇబ్బడి ముబ్బడిగా పరిశ్రమలను స్థాపించి తమ వాళ్లకు పెద్దకొలువులు, ఇక్కడి ప్రజలకు వెట్టిచాకిరీ ఉద్యోగాలు ఇచ్చి సమీప ప్రాంతాలను మృత్యుదిబ్బలుగా మార్చేశారు. ప్రపంచంలో 70 శాతానికి సరిపడే మందులు మన హైదరాబాద్‌లో తయారవుతున్నాయి. అంటే ఇక్కడ కాలుష్యం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వివిధ రకాల పరిశ్రమలను స్థాపించి హైదరాబాద్ శివారు ప్రాంతాలను కలుష్యం కోరల్లోకి నెట్టివేసిన పాలకులు తమ ప్రాంతంలో మాత్రం పరిశ్రమలను స్థాపించడానికి అన్ని వనరులున్నా పట్టించుకోవడం లేదు. పరిశ్రమల వల్ల వచ్చే ఫలాలు తమ వారికి, వాటితో తలెత్తే కాలుష్య ప్రభావం తెలంగాణ బిడ్డలపైకి విడిచిపెడుతున్నారు. ఇప్పటికే వాయు, శబ్ద, జల, భూమి కాలుష్యాలతో ఆవాసానికి ఆయోగ్యంగా మారిన హైదరాబాద్ శివారు ప్రాంతాలు రసాయన వ్యర్థాల పుణ్యమా అని మరింత దారుణంగా మారుతున్నాయి. దుర్గం చెరువు, కిష్టారెడ్డిపేట, ఖాజిపల్లి, ఆసానికుంట, సాయి చెరువు, నూర్ మహ్మద్‌కుంట, పెద్ద చెరువుల్లో ప్రమాదకర స్థాయిలో కాలుష్యం దాగి ఉందని యునెస్కో తన నివేదికలో పేర్కొంది. దుర్గం చెరువులో 45 శాతం కరగని ప్రమాదకర స్థాయి నెలకొనగా, మిగతా చెరువుల్లో 50 శాతం ఆక్సిజన్ కరగడం లేదని యునెస్కో నివేదించింది. సమీపంలోని వివిధ పరిశ్రమల నుంచి వెలువడే పారిశ్రామిక వ్యర్థాల వల్లే నీరు కలుషితమైపోతుందని హెచ్చరించింది. రసాయనాలు చెరువుల్లో చేరి, ఫ్లోరైడ్, లవణీయత, ఐరన్ వంటి అవాంఛనీయ లోహాల అవశేషాలతో నీరు కలుషితమైనట్లు పేర్కొంది. ఐదేళ్లలోపు చిన్నారుల్లో మూడో వంతు మంది కాలుష్య నీటితో మృత్యువాత పడుతున్నట్లు యునెస్కో ఆందోళన వ్యక్తం చేసింది. పిల్లల్లో డయేరియా, న్యుమోనియా, మలేరియా తదితర వ్యాధులు నీటి ద్వారా సంక్రమిస్తున్నాయని వివరించింది. వీటిద్వారా పిల్లల కడుపుల్లో నులిపురుగులు ఏర్పడి ఎదుగుదల లోపిస్తోందని, ఈ మొత్తం విపరిణామాలకు నీటి కాలుష్యమే కారణమని తెలిపింది. నీటి యాజమాన్య విధానం సరిగా లేకపోవడం, ప్రజలకు శుద్ధ జలాలు అందించాలనే స్పృహ పాలకులకు లేకపోవడం కారణమని ఆవేదన వ్యక్తం చేసింది. బాలల హక్కుల కోసం పనిచేస్తున్న అంతర్జాతీయ వేదిక మన చెరువుల్లోని కాలుష్యం పరిస్థితి, పాలకుల అలసత్వాన్ని బయటపెట్టే వరకు ఈ ప్రాంతం నుంచి చట్టసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు గొంతు విప్పకపోవడం గమనార్హం. ఎంతసేపు పదవులకోసం పాకులాడటమే తప్ప ప్రజలను పట్టించుకోకపోవడం వల్లనే సీమాంధ్ర పెట్టుబడిదారులు ఇష్టం వచ్చినట్లుగా రెచ్చిపోతున్నారని బాలల హక్కుల సంఘాల బాధ్యులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అంతా మేల్కొని హైదరాబాద్‌ను కాలుష్యం కోరల్లోంచి బయటపడేయకపోతే భాగ్యనగరి బతికేందుకు పనికిరాకుండా పోతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా పరిశ్రమల కాలుష్యాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాల్సిని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఆయా పరిశ్రమలకు నోటీసులివ్వడం మినహా ఏమీ చేయలేకపోతుంది. కాలుష్య నివారణ ప్రమాణాలు పాటించని పరిశ్రమలను మూసివేసే అధికారం ఉన్నా పీసీబీ చూస్తూ ఊరుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.