మన మహిళలు సమ్మక్క సారక్కలే

బాబు హయాంలోనే బాబ్లీకి బీజం
అఖిలపక్షం వేయాలని కేసీఆర్‌ డిమాండ్‌
హైదరాబాద్‌, మార్చి 3 (జనంసాక్షి) :
మన మహిళలు సమ్మక్క సారక్కలేనని టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. వారు అత్యంత ప్రతిభావంతులని అవకాశం వస్తే బెస్ట్‌ మేనేజర్లమని నిరూపించుకుంటారని అన్నారు. నగరంలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో టీఎల్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మనదేశంలో కుటుం బ వ్యవస్థ కీలకమన్నారు. కుటుంబ ఆర్థిక వ్యవస్థ మహిళల చేతుల్లోనే ఉండాలన్నారు. మహిళల ప్రతిభను దేశాభివృద్ధికి వినియోగించుకోవాలని సూచించారు. అన్నింటిని మించిన సంపద మానవ సంపద అని, భారతదేశం అద్భుతమైన మానవ వనరులను కలిగి ఉందన్నారు. ఇందులో దళితులు, నిమ్న వర్గాల పేరిట 20శాతం మంది జనాభాను ఊరి అవతల పెడుతున్నామన్నారు. మిగిలిన 80శాతం మందిని అనుత్పాదక రంగానికి పరిమితం చేశారన్నారు. సగభాగమైన మహిళలను వంటింటికే పరిమితం చేస్తున్నామని, ఇది మనదేశ దౌర్భాగ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. జాతి నిర్మాణ కార్యక్రమం నుంచి మహిళలను దూరం పెట్టడం సరైంది కాదన్నారు. మహిళల్లో ఉన్న ప్రతిభను దేశ అభ్యున్నతికి వినియోగించు కోవాలని సూచించారు. యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌ త్వరితగతిన తెలంగాణ ఇస్తారని ఆశిద్దామన్నారు. తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదని.. వెనక్కి నెట్టబడిన ప్రాంతమని ఆవేదనగా అన్నారు. కాంట్రాక్టు ఉద్యోగాల నియామకం చేపట్టిందని టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే కాంట్రాక్టు ఉద్యోగులందర్నీ రెగ్యులరైజ్‌ చేస్తామని హామీ ఇచ్చారు. సీమాంధ్రలో కంటే తెలంగాణ ప్రాంతంలోనే ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువగా వస్తోందన్నారు. బాబ్లీ ప్రాజెక్టు వ్యవహారంపై అఖిలపక్ష సమావేశాన్ని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఎందుకు చేపట్టడం లేదో అర్థం కావడం లేదన్నారు. అవసరమైతే అన్ని పార్టీల వారిని ఢిల్లీకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కిరణ్‌కుమార్‌రెడ్డిపై ఉందన్నారు. 60 టీఎంసీల నీటికి లోబడి ప్రాజెక్టు నిర్మించినట్టు మహారాష్ట్ర ప్రభుత్వం చెబుతోందన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బాబ్లీపై అబద్ధలాడుతున్నారన్నారు. అధికారం కోసం చంద్రబాబు ఎన్ని అబద్ధాలైనా ఆడుతారన్నారు. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది టీడీపీ హయాంలోనేనని స్పష్టం చేశారు. 1995లో బాబ్లీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా 1996లో ప్రాజెక్టు డిజైన్‌కు ఆమోదం లభించిందని ప్రాజెక్టు నిర్మాణం కోసం 1998లో టెండర్లు పిలిచారని, 2003లో రివైజ్డ్‌ టెండర్లు దాఖలు చేశారని చెప్పారు. 1995 నుంచి 2004 ఎన్నికల వరకు తెలుగుదేశం పార్టీయే అధికారంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఆ సమయంలో ఇరిగేషన్‌ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారన్నారు. బాబ్లీపై చంద్రబాబు కాని ఆయన పార్టీ నేతలు కాని ఎన్ని మాటలు మాట్లాడినా ప్రజలు నమ్మబోరన్నారు. నాడు నిలదీయకుండా నేడు రంకెలు వేస్తే ఏం ప్రయోజనం చేకూరుతుందో చంద్రబాబుకే తెలియాలన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఎన్టీఆర్‌ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తే దాన్ని ఎత్తివేసిన ఘనుడు చంద్రబాబు అన్నారు. తాను అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానని ఇటీవల హామీ ఇవ్వడం హాస్యాస్పదమన్నారు. అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు ఎన్నో కుయుక్తులు పన్నుతున్నారన్నారు. పైగా బాబ్లీ ప్రాజెక్టు విషయంలో టీఆర్‌ఎస్‌పై ముఖ్యంగా కెసిఆర్‌పై బురదజల్లడం రాజకీయ లబ్ధి కోసమే నన్నారు. బాబ్లీ విషయంలో తెలుగుదేశం పార్టీది వితండ వాదమన్నారు. బాబ్లీపై ముఖ్యమంత్రి స్పందించాలన్నారు. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం విషయంపై అనుమానాలు తలెత్తడంతో తొలిగా స్పందించింది తానేనన్నారు. తొలిగా కేసు దాఖలు చేసిన ఘనత కూడా టీఆర్‌ఎస్‌కే చెందుతుందన్నారు. బాబ్లీ వివరాలను నిపుణులే స్వయంగా సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు. వారిలో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలన్నారు. తెలంగాణ కోసం 12 ఏళ్ల క్రితం ఉద్యమం చేపడితే ఎన్నో అవమానాలు ఎదురయ్యాయన్నారు. గుప్పెడు మందిని వెంట బెట్టుకుని ఊరువాడ తిరుగుతూ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నామన్నారు. క్రమేణా తనతో కొన్ని వేల అడుగులు మరికొంత కాలానికి కొన్ని లక్షల గొంతులు తన గళానికి తోడయ్యాయన్నారు. అలా.. అలా అడుగులేసుకుంటూ 12 ఏళ్లకు ఉద్యమాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లగలిగానన్నారు. కేసీఆర్‌ తల తెగిపడ్డా ఉద్యమం ఆగబోదన్నారు. తెలంగాణ వచ్చేంతవరకు ఉద్యమం కొనసాగిస్తామన్నారు. స్వరాష్ట్రంలో సగర్వంగా తల ఎత్తుకుని తిరుగుదామని పిలుపునిచ్చారు.