మన సాగర్‌కు కొత్త బోట్లు

2

– ప్రారంభించిన సానియా మీర్జా

హైదరాబాద్‌,మార్చి2(జనంసాక్షి):హైదరాబాద్‌ లోని హుస్సేన్‌ సాగర్‌ లో పర్యాటకులకు కొత్త బోట్‌ జోష్‌ తేనున్నది. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ కొత్తగా రెండు అత్యాధునిక బోట్లను అందుబాటులోకి తెచ్చింది. అమెరికన్‌ కేటమరాన్‌ బోట్లను తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌ సానియా విూర్జా ప్రారంభించింది. ఆ తర్వాత టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ పేర్వారం రాములు, ఎండీ లతో కలిసి సరదాగా బోటులో ప్రయాణం చేసింది. కాసేపు బోటును నడిపి ముచ్చట తీర్చుకుంది. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ ను పెంచేలా, ఉల్లాస వాతావరణాన్ని పెంపొందించేలా.. పర్యాటకులను ఆకర్షించేలా పర్యాటకాభివృద్ధి సంస్థ పలు కార్యక్రమాలు చేపడుతోంది. హెలీ టూరిజం పేరిట నగర వాసులకు హెలికాప్టర్లలో జాయ్‌ రైడ్‌ ను నిన్ననే అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు రెండు లగ్జరీ బోట్లు ప్రారంభించింది. 12 మంది సీటింగ్‌ కేపాసిటీ కల్గిన కేటమరాన్‌ బోట్లలో అత్యధునిక సదుపాయాలు ఉన్నాయి. సాగర్‌ జలాల్లో అతి తక్కువ ఎత్తు నుంచి ప్రయాణించవచ్చు. ఒక్కొక్కరికి 100 రూపాయలు ఛార్జ్‌ వసూలు చేస్తారు. హుస్సేన్‌ సాగర్‌ జలాల్లో బోటింగ్‌ అద్భుతంగా ఉందని, చిన్ననాటి అనుభూతులు జ్ఞాపకం వచ్చాయని సానియా విూర్జా తెలిపింది. తెలంగాణను ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర పర్యటకాభివృద్ధి సంస్థ చేస్తున్న కృషిని సానియా విూర్జా ప్రశంసించింది. శతాబ్ధాల నుంచే ప్రపంచ పటంలో హైదరాబాద్‌ కు ఓ స్థానం ఉందని, ఇక్కడి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసి ప్రపంచ టూరిస్టు ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ టూరిజం డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పేర్వారం రాములు చెప్పారు. సీఎం కేసీఆర్‌ విజన్‌ వల్ల తెలంగాణకు గత సంవత్సర కాలంగా ప్రపంచ పర్యాటకుల సంఖ్య పెరిగిందన్నారు. హైదరాబాద్‌ తో సమాంతరంగా జిల్లాల్లోనూ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల పెంపుపై దృష్టిసారించారు.