మయన్మార్‌లో మానవ హక్కుల ఉల్లంఘనపై భారత్‌ నోరు విప్పాలి

మయన్మార్‌లో కొనసాగుతున్న సైనిక అకృత్యాలు
గూడు, నీడ కోల్పోయిన రెహెంగ్యా తెగ
శరణార్థి శిబిరాలే ఆవాసం
నైప్యిడౌ, (జనంసాక్షి) :
మయన్మార్‌లో మానవ హక్కుల ఉల్లం ఘనపై భారత్‌ నోరు విప్పాలని మానవ హక్కుల సంఘాల డిమాండ్‌ చేస్తున్నాయి. అక్కడ మైనార్టీ పక్షం రెహెంగ్యా ముస్లిం తెగపై మెజార్టీ బౌద్ధ సమాజం, సైన్యం జరుపుతున్న అకృత్యాలను శాంతికాముక దేశంగా చెప్పుకుంటున్న భారత్‌ అంత ర్జాతీయ వేదికలపై ప్రశ్నించాలని ఆయా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. పొరుగు దేశంలో జరుగుతున్న హక్కుల హననాన్ని ప్రశ్నించని భారత్‌కు శాంతి కాముక దేశంగా చెప్పుకునే హక్కులేదని ఆయా సంఘాల ప్రతినిధు లు పేర్కొం టున్నారు. అల్పసం ఖ్యాకులపై పాలకులే దాడులకు తెగబడితే నిలువ నీడ కూడా లేకుండా చేస్తే ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయో మయన్మార్‌లో చోటు చేసుకున్న పరిస్థితులు అద్దం పడుతు న్నాయని వారు అంటున్నారు. మయన్మార్‌లోని రెహెంగ్యా తెగ ముస్లింలపై జరుగుతున్న మారణకాండ, దారుణాలపై ‘జనంసాక్షి’ ప్రత్యేక కథనం…

జీవనయానానికి అనువైన ప్రాంతంలో నివాసం ఏర్పరుచుకోవడం మానవ వికాస చరిత్రలో అనాదిగా వస్తోంది. ప్రస్తుతమున్న మానవ సమూహాలన్నీ అలా ఏర్పడినవే. ఆ సమూహాలు కొద్దికాలం తర్వాత బలవంతంగానో, అనివార్యంగానో ఒక పాలకవర్గం కిందికి చేరినవే. ఇలాంటి పాలకుల్లో ప్రభువులు, రాజులు, నియంతలు ఇలా ఎందరో. తర్వాతి కాలంలో రాజ్యకాంక్షతో వివిధ వర్గాలు ప్రపంచంపై దండెత్తి తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాయి. ఇంగ్లిష్‌ పాలకులు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు. తర్వాతికాలంలో ప్రజాస్వామిక ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ప్రజల చేతుల్లోకి ఓటు అనే వజ్రాయుధం వచ్చి చేరింది. కానీ ఐదు దశాబ్దాలుగా తమ భూభాగంలో జీవనం సాగిస్తున్న వారిని తమ దేశ పౌరులుగా గుర్తించనంటోంది మయన్మార్‌ ప్రభుత్వం. వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించబోమని తెగేసి చెప్పింది. పోని తాము నివసించే ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగానైనా గుర్తించాలని కోరితే ససేమిరా అంది. మా ప్రాంతానికి వలస వచ్చి దేశాన్ని విడదీయమంటారా అంటూ పాలకులు తమ సైన్యంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న నిర్భాగ్యులపై దాడులకు తెగబడ్డారు. దీంతో పచ్చని పర్వతప్రాంతం వెచ్చని నెత్తుటి తడితో శవాలదిబ్బగా మారింది.

భారతదేశానికి ఈశాన్యాన ఉన్న మయన్మార్‌లోని రాఖినే ప్రావిన్స్‌ ప్రాంతంలో రెహెంగ్యా తెగ ముస్లింలు యాభై ఏళ్లుగా జీవనం సాగిస్తున్నారు. సముద్రమే వారి నేస్తం. నిత్యం సముద్రంపై ఆధారపడే బతుకులీడుస్తున్నారు. సుమారు ఎనిమిది లక్షల మంది రహెంగ్యా తెగ ప్రజలను తమ పౌరులుగా గుర్తించేందుకు మయన్మార్‌ ప్రభుత్వం ససేమిరా అంటోంది. వారిపై 1978 నుంచి దాడులు కొనసాగిస్తోంది అక్కడి సైన్యం. దీనికి ఆపరేషన్‌ నాగమిన్‌ (డ్రాగన్‌ కింగ్‌) అనే పేరుపెట్టుకుంది. వారి దాడుల్లో సుమారు 800 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం రెహ్యెంగా ముస్లింలు గూడు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. బెంగాళీలు అక్రమంగా తమ భూభాగంలోకి చొరబడి, ప్రచ్ఛన్న యుద్ధానికి ప్రయత్నిస్తున్నారని, మరో దేశం కావాలని వేర్పాటు పోరాటాలు సాగిస్తున్నారని ఆ దేశాధ్యక్షుడు థీన్‌ సేన్‌ ఇటీవల ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అందుకే వారిని పారద్రోలుతున్నామని అత్యంత దుర్మార్గంగా ప్రకటించారు. ఆయన ప్రకటనను మయన్మార్‌ హక్కుల నేత, ప్రతిపక్ష నాయకురాలు ఆంగ్‌సాంగ్‌ సూకి తప్పుబట్టారు. అయినా సైన్యం అకృత్యాలు ఆగలేదు. దీంతో రెంహెగ్యా ముస్లింలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సమీపంలోని బంగ్లాదేశ్‌తో పాటు పడవల ద్వారా బంగాళఖాతంలోకి ప్రవేశించారు. ఇలా రెండు నావల్లో ఎలాంటి ఆహారం, తాగునీరు లేకుండా ప్రవేశించిన వారు రెండు వారాల పాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాలం గడిపారు. వారిని ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ సేవలు రక్షించి ఆస్పత్రులకు తరలించామని, ఆహారం, మందులు అందించామని కోస్ట్‌గార్డ్‌ కమాండెంట్‌ ఎస్‌.ఆర్‌. నాగేంద్రన్‌ ఇటీవల ప్రకటించారు. 109 మంది రెహెంగ్యా శరణార్థులతో బయలుదేరిన ఓ బోటులో మూడేళ్ల చిన్నారి డీహైడ్రేషన్‌తో మృతిచెందితే అంత్యక్రియలు నిర్వహించలేని పరిస్థితిలో చిన్నారి మృతదేహాన్ని సముద్ర జలాల్లోనే విడిచిపెట్టామని వారు పేర్కొన్నారు. మరెందరో ప్రాణాలు రక్షించుకునేందుకు సమీపంలోని వివిధ ప్రాంతాలకు వలసపోయారు. అక్కడ ఏర్పాటు చేసిన శరణార్థి శిబిరాల్లో తలదాచుకొని రోజులు వెళ్లదీస్తున్నారు. వీరి దుస్థితిపై అంతర్జాతీయ సమాజంతో పాటు ఐక్యరాజ్య సమితి దృష్టి సారించింది. ఇటీవల ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్‌ ముఖ్య కార్యదర్శి శరణార్థి శిబిరాలను సందర్శించి వారి దుస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మయన్మార్‌లో మెజార్టీ వర్గీయులైన బౌద్ధ మతస్తులు శరణార్థులు నిజాలు వెల్లడించకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నాలపై మానవ హక్కుల సంఘాలు పెద్దస్థాయిలో ధ్వజమెత్తాయి. ఈ నేపథ్యంలో మయన్మార్‌ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి దీపు మోని మీడియాతో మాట్లాడుతూ రెహెంగ్యా తెగ ముస్లింలను తమ దేశ పౌరులుగా గుర్తించేందుకు సిద్ధమని ప్రకటించింది. రెహెంగ్యా తెగ నాయకుడు అలీ అష్రఫ్‌ మాట్లాడుతూ అల్లాహ్‌కు అంతా తెలుసు.. ఆయన తమకు శాంతితో కూడిన గూడును సమకూర్చుతాడని పేర్కొన్నారు.