మరింత ఆలస్యం కానున్న కర్నాటక కేబినేట్‌ విస్తరణ

రాహుల్‌ విదేశీ పర్యటనే కారణమని సమాచారం
న్యూఢిల్లీ,మే28(జ‌నం సాక్షి ): సోనియా,రాహుల్‌ విదేశీ పర్యటనలకు వెళ్లడంతో కర్నాటక మంత్రివర్గ విస్తరణ మరో వారంపాటు ఆలస్యం అయ్యిఏ అవకాశాలు ఉన్నాయి. మంత్రివర్గంపై చర్చించేందుకు సిఎం కుమారస్వామి ఢిల్లీ చేరుకున్నా కాంగ్రెస్‌ అగ్రనేతలు లేకపోవడంతో ఆయన విస్తరణపై చర్చించే అవకావం లేకుండా పోయింది. జేడీఎస్‌ నేత కుమారస్వామి సీఎంగా ప్రమాణం చేసి  ఆరు  రోజులు అవుతున్నది. అయితే ఇంకా రాష్ట్ర క్యాబినెట్‌ను మాత్రం విస్తరించలేదు. ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు. కానీ తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తన తల్లి సోనియాతో కలిసి అమెరికా వెళ్లారు. దీంతో కర్నాటక క్యాబినెట్‌ విస్తరణ మరో అయిదు రోజులు ఆలస్యంగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మెడికల్‌ చెకప్‌ కోసం అమెరికా వెళ్తున్నట్లు రాహుల్‌ ట్వీట్‌ చేశారు. రాహుల్‌, సోనియా తిరిగి వచ్చిన తర్వాతే.. కర్నాటక మంత్రిమండలి వివరాలను వెల్లడిస్తామని సిద్ధరామయ్య తెలిపారు. ఆర్థిక మంత్రి ఎవరన్న దానిపై కాంగ్రెస్‌, జేడీఎస్‌ మధ్య విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే కాంగ్రెస్‌ పార్టీ దయ వల్లే తాను సీఎం అయినట్లు కుమారస్వామి తెలిపారు. సీఎంగా కర్నాటక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం తన బాధ్యత అని ఆయన అన్నారు. కానీ ఏది చేయాలన్నా.. కాంగ్రెస్‌ నేతల అనుమతి తీసుకోవాలని, వాళ్ల పర్మిషన్‌ లేకుండా ఏవిూ చేయలేమని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఇవ్వడం వల్లే తాను సీఎం అయినట్లు కుమారస్వామి అన్నారు.