మరిన్ని ప్రాంతాలకు మెట్రో విస్తరణ
ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కెటిఆర్ ట్వీట్
హైదరాబాద్,నవంబర్29(జనంసాక్షి): హైదరాబాద్ మెట్రో రైలును మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మెట్రో ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం ఉదయం ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. హైదరాబాద మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే 3.2 కోట్ల మంది ప్రయాణికులు మెట్రో సేవలను వినియోగించుకున్నారని పేర్కొన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు మెట్రో ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ సందర్భంగా మెట్రో ప్రారంభోత్సవానికి సంబంధించిన చిత్రాలను పంచుకున్నారు. అనేక ప్రత్యేకతలతో అంతర్జాతీయ ఖ్యాతి దక్కించుకున్న మన మెట్రో రైలు ఏడాది పూర్తి చేసుకుంది. నవంబర్ 28న 2017 ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చేతుల విూదుగా ప్రారంభించిన మెట్రోరైలు సంవత్సరం పూర్తిచేసుకొని ప్రారంభించిన మొదటిరోజు నుంచే ప్రయాణికుల అభిమానాన్ని చూరగొన్నది. రికార్డు స్థాయిలో ఇప్పటివరకు 32 మిలియన్ల మందిని గమ్యస్థానాలకు చేర్చింది. దేశంలోనే మొట్టమొదటి పీపీపీ ప్రాజెక్టుగా నిర్మితమవుతున్న మెట్రోరైలు వచ్చే డిసెంబర్‌లో అవిూర్‌పేట నుంచి హైటెక్‌సిటీ వరకు అందుబాటులోకి రానున్నది. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మార్గం కూడా వేగవంతంగా నిర్మితమవుతున్నది. అయితే నగరం నలుమూలల నుంచి ఎయిర్‌పోర్టుకు కనెక్టివిటీ పెంచాలనే ఉద్దేశంతో మరిన్ని కారిడార్లను రెండోదశలో భాగంగా ప్రభుత్వం విస్తరిస్తున్నది. దీని డీపీఆర్ బాధ్యతలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ మెట్రోరైలుకు అప్పగించగా, ప్రాథమిక రిపోర్టును ప్రభుత్వానికి అందించింది. ఇటీవల మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఉప్పల్ నుంచి మల్లాపూర్ విూదుగా ఈసీఐఎల్ వరకు మెట్రోను పొడిగిస్తామని ప్రకటించారు. దీంతో నగరం నలువైపులా మెట్రోలో ప్రయాణించడమే కాకుండా నగరం నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికైనా మెట్రోలో ప్రయాణించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది. అంతర్జాతీయ స్థాయి హంగులతో నిర్మితమవుతున్న హైదరాబాద్ మెట్రోరైలు అనేక అవార్డులు సొంతం చేసుకున్నది. దేశంలోనే పీపీపీ మోడల్‌లో విజయవంతమైన ఏకైక మెట్రోప్రాజెక్టు ఇదేనని తెలిపారు. సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి, నగర ప్రజలతోపాటు అన్ని వర్గాలకు కృతజ్ఞతలు తెలిపారు.