మరోమారు కదం తొక్కిన పసుపు,ఎర్రజొన్న రైతులు
గిట్టుబాటు ధరలు కల్పించే వరకు ఆందోళన
తామేవిూ టెర్రరిస్టులం కాదని ఆగ్రహం
సిఎం కెసిఆర్ తమ సమస్యలు పరిష్కరించాలని వినతి
అడుగడుగునా అరెస్ట్‌లపై మండిపాటు
నిషేధాజ్ఞలు విధించిన పోలీసులు
నిజామాబాద్,ఫిబ్రవరి12(జనంసాక్షి): ఎర్రజొన్న, పసుపు పంటలకు మద్దతు ధరలు చెల్లించి కొనుగోలు చేయాలని అడిగితే ఎక్కడిక్కడ రైతులను అరెస్ట్ చేయడంపై అన్నదాతలు మండిపడ్డారు. వేలాదిగా ఆందోళనరకు దిగిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. తామేవిూ పాకిస్థాన్, అఫ్ఘనిస్తాన్ నుంచి రాలేదని, తామేవిూ టెర్రరిస్టులం కాదని వారు అన్నారు. తమను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఆర్మూర్ రోడ్డుపై అడ్డంగా పడుకుని తమకు గిట్టుబాటు దరలు చెల్లించాలని వారు వరుసగా రెండోరోజూ ఆందోళనకు దిగారు. దీంతో ట్రాఫిక్ స్తంభించి పోయింది. పసుపునకు 15వేలు, ఎర్రజొన్నలకు 3500 ధరలు చెల్లించాలని రైతులు కోరారు. అవసరమైతే సిఎం కెసిఆర్‌ను కలిసేందుకు పాదయాత్రగా వెళతామని అన్నారు. గిట్టుబాటు ధరలు ప్రకటించాలని మంగళవారం జాతీయ రహదారిపై బైఠాయించారు. పసుపు, ఎర్రజొన్నలకు మద్దతు ధర కల్పించడంతో పాటు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ రోడ్డులో నిరసనకు దిగారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆత్మగౌరవ ర్యాలీ కార్యక్రమానికి ఆర్మూర్ డివిజన్‌లోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు తరలి వచ్చి రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వం వచ్చి తమ డిమాండ్లు నెరవేర్చే వరకూ ఆందోళన విరమించబోమని భీష్మించారు. రాస్తారోకో చేసేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత తలెత్తింది. ఆర్మూర్, బాల్కొండ నియోజక వర్గాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన రైతులు హైవేపై బైఠాయించారు. గిట్టుబాటు ధరలు ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నినాదాలు చేశారు. రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించారు. వన్ వే నుంచి వాహనాలను మళ్లించారు. పసుపు పంటకు రూ.15 వేలు, ఎర్రజొన్నకు రూ.3,500 చొప్పున గిట్టుబాటు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్రలోని సాంగ్లి మార్కెట్‌లో పసుపు ధర రూ.9 వేలు పలుకుతుంటే, నిజామాబాద్ మార్కెట్‌లో రూ.4,5 వేల లోపు ధర పలకడం వెనక ఆంతర్యమేమిటని రైతు నాయకులు ప్రశ్నించారు. అధికారులు దళారులకు, వ్యాపారులకే వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ఈనామ్‌లో పసుపు పంట నాణ్యత వివరాలను అధికారులు నమోదు చేయకపోవడంతో దేశ వ్యాప్తంగా ఉన్న వ్యాపారులు టెండర్‌లో పాల్గొనడం లేదన్నారు. ఈనామ్‌లో అధికారులే రూ.4 వేల నుంచి ధర టెండర్ కోట్ చేయడంతో రైతులు నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత తక్కువ కోట్ చేసే అధికారం వారికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. పలుమార్లు రైతులను మోసం చేసిన వ్యాపారులకే తిరిగి కొనుగోలు చేసే అవకాశం ఇచ్చిన అధికారులు మళ్లీ అదే పునారవృతమైతే బాధ్యత వహిస్తారా? అన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం రైతులకు తోడ్పాటునందించాలని, స్వామినాథన్ కమిషన్ సూచనల మేరకు పంటకు మద్దతు ధర కల్పిస్తూ కొనుగోలు చేయాలని రైతు నాయకులు డిమాండ్ చేశారు. రూ.2 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 11వ తేదీ వర కు తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హావిూ రాకపోతే 12వ తేదీన కుటుంబానికి ఇద్దరు చొప్పున ఆర్మూర్‌కు తరలి
వచ్చి భారీ ఆందోళన చేపడతామని రైతు నాయకులు ముందే హెచ్చరించారు. ఆ మేరకు మరోమారు వారు ఆర్మూర్ వద్ద ఆందోళనకు దిగారు. ఆర్మూర్ రెవెన్యూ డివిజన్‌లోని 11 మండలాలతో పాటు ఇందల్‌వాయి, డిచ్‌పల్లి మండలాలలో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. ఎర్రజొన్న, పసుపు రైతులు వివిధ డిమాండ్లపై మంగళవారం ఆందోళనల నేపథ్యంలో పోలీసు కమిషనర్ కార్తికేయ జిల్లాలోని పదమూడు మండలాలలో 144 సెక్షన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి బుధవారం ఉదయం ఆరు గంటల వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఏడో తేదీన రైతులు పసుపు బోర్డు ఏర్పాటు, ఎర్రజొన్న, పసుపు పంటలకు మద్దతు ధరలు కల్పించాలని ధర్నా, రాస్తారోకో నిర్వహించి ప్రజలను అసౌకర్యానికి గురి చేశారని పేర్కొన్నారు. రైతులు పెద్ద సంఖ్యలో గుమిగూడి ప్రజలను అసౌకర్యానికి గురి చేయకుండా, ప్రశాంతతకు భంగం కలిగించకుండా ఆర్మూర్ రెవెన్యూ డివిజన్‌లోని ఆర్మూర్, నందిపేట్, బాల్కొండ, ముప్కాల్, మెండోరా, మోర్తాడ్, ఏర్గట్ల, భీమ్‌గల్, కమ్మర్‌పల్లి, వేల్పూర్, జక్రాన్‌పల్లి మండలాలతో పాటు నిజామాబాద్ రెవెన్యూ డివిజన్‌లోని ఇందల్‌వాయి, డిచ్‌పల్లి మండలాలలో 144 సెక్షన్ విధిస్తున్నట్లు వివరించారు.