మరోసారి నిజాం పాలన చూస్తున్నాం


– నిజాం పాలన తరిమేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలి
– బీజేపీతోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యం
– విలేకరుల సమావేశంలో పరిపూర్ణానంద
వరంగల్‌, నవంబర్‌3(జ‌నంసాక్షి) : నిజాం గురించి చదువుకున్నారు.. అరాచకాలు, అణచివేతలు, దాడులు, మానభంగాల గురించి విన్నారు. అవన్నింటినీ ఇప్పుడు ఈ 8వ నిజాం చూపిస్తున్నాడని బీజేపీ నేత, శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద అన్నారు. శనివారం వరంగల్‌లో ఆయన మాట్లాడుతూ.. వరంగల్‌లో సాయిబాబా మందిర పూజారిపై ముస్లిం మతోన్మాది విచక్షణ రహితంగా దాడి చేయడంతో చనిపోయారని అన్నారు. తాను ఆ పూజారి అంతిమ యాత్రకు వెళ్తే వందలాది మంది పోలీసులను రంగంలోకి దించారని అసహనం వ్యక్తం చేశారు. దారుస్సలామ్‌ కనుసన్నల్లోనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నడుస్తోందని అన్నారు. రజాకార్ల పాలనను గత ప్రభుత్వాలు కొనసాగిస్తూనే ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రజలు దారుస్సలామ్‌ కనుసన్నల్లో కాదు లాల్‌ దర్వాజ కనుసన్నల్లో నడవాలని అనుకుంటున్నారని చెప్పారు. తెలంగాణలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని పరిపూర్ణానంద ఆవేదన వ్యక్తం చేశారు. ‘మహా కూటమి సారథి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి జీసస్‌ పరిపాలన తీసుకొస్తానంటున్నారని, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ అయితే తెలంగాణ అంటే నిజామే అని అసెంబ్లీ సాక్షిగా అన్నారని గుర్తుచేశారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించడం బీసీల పొట్ట కొట్టడమే అని వ్యాఖ్యానించారు. తమ ఫోన్‌లు ట్యాపింగ్‌ చేస్తున్నారనే అనుమానం ఉందని పరిపూర్ణానంద తెలిపారు. అందుకే.. డిసెంబర్‌ 7న ప్రతి హిందువు ఓటు వేయాలని, తమను ఎవరు బాగా చూసుకుంటారనుకుంటారో వారికి ఓటు వేయండి అని పిలుపునిచ్చారు. బీజేపీలో కులమతాలుండవని పరిపూర్ణానంద స్పష్టం చేశారు.