మరో సంగ్రామానికి తెలంగాణ సిద్ధం !
ఊరుకున్నది చాలని.. లడాయికి కదం తొక్కుతున్న పోరు బిడ్డలు
డిసెంబర్ 9న రాజధానిని ఘెరావ్ చేసేందుకు వ్యూహ రచన
కోదండరాం నాయకత్వంపై పెరుగుతున్న ప్రజల విశ్వాసం
క్షేత్రస్థాయిలో బలపడుతున్న టీ జేఏసీ
హైదరాబాద్,అక్టోబర్ 14 (జనంసాక్షి) : ప్రత్యేక రాష్ట్ర సాధనోద్యమంలో భాగంగా తెలంగాణ మరో సంగ్రామానికి సిద్ధమవుతున్నదా ? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే వినవస్తోంది. కిందటి నెలలో జరిగిన తెలంగాన మార్చ్ ఇచ్చిన ఊపుతో, అంతకు మించిన ఉద్యమ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఉద్యమ నాయకులు భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. తెలంగాణ మార్చ్ నిర్వహణ వరకు కూడా చర్చల పేరు చెప్పి, రేపిస్తాం, మాపిస్తామంటూ బుకాయించిన కేంద్రానికి పెద్ద ఎత్తునే సవాల్ విసిరేందుకు తెలంగాణ ప్రజానీకం సిద్ధమవుతోంది. ఇంతకాలం ఓపిక పట్టింది చాలు.. ఇక సమరమేనని సబ్బండ వర్ణాలు సమర శంకం పూరించేందుకు కదం కదం కలుపుతున్నాయి. ఇందులో భాగంగానే గతంలో 2009, డిసెంబర్ 9న తెలంగాణ ఇస్తామని ప్రకటన చేసి, ఆపై వెనక్కి తీసుకున్న ఆ తేదీనే ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నాయి. రానున్న డిసెంబర్ 9న రాజధాని హైదరాబాద్‌ను ఘెరావ్ చేసి మళ్లీ తమ ఆకాంక్షను చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ ఉద్యమానికి తెలంగాణ మార్చ్ లాగే నాయకత్వ బాధ్యతలను జేఏసీకే అప్పగించాలని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. తెలంగాణ మార్చ్‌తో జేఏసీ కొత్త శక్తిగా అవతరించిన విషయం తెలిసిందే. మార్చ్ ఇచ్చిన స్ఫూర్తితో జేఏసీ ఇప్పటికే క్షేత్రస్థాయిలో బలపడింది. ఇంకా జనంలో చొచ్చుకు పోయేందుకు జేఏసీ నాయకులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. చర్చలు, డెడ్‌లైన్‌లు పెట్టే పార్టీల కన్నా, ప్రత్యక్షంగా ఉద్యమిస్తున్న జేఏసీ వైపు ఉంటేనే తెలంగాణ రాష్ట్రం కల సాకారమవుతుందని ప్రజలు భావిస్తున్నారు. అందుకే, తెలంగాణ మార్చ్ విజయవంతం అయిందని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.