మళ్లీ కేజ్రీ జంగ్
న్యూదిల్లీ,ఏప్రిల్ 20(జనంసాక్షి):దిల్లీ ప్రభుత్వం, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మధ్య మరోసారి విభేదాలు తలెత్తాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓ అధికారిని నియమిస్తూ జారీచేసిన ఉత్తర్వులను లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ నిలిపేశారు. అసలేం జరిగిందంటే…సీనియర్ ఐపీఎస్ అధికారి జేకే శర్మను తిహార్ జైలు డీజీగా నియమిస్తూ.. కేజ్రీవాల్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1982వ బ్యాచ్‌కు చెందిన శర్మ ఇప్పటికే దిల్లీ డీజీ(¬ంగార్డు)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా.. జైళ్ల డీజీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దిల్లీ ¬ంశాఖ అదనపు సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు.అయితే ఈ నియామకం చేపట్టే ముందు ప్రభుత్వం లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌ను సంప్రదించలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ముందస్తు అనుమతి కోసం నియామక ఫైల్‌ను ఎల్‌జీ కార్యాలయానికి పంపలేదు. దీంతో డీజీ నియామకం చెల్లదని లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.